తల్లి చనిపోతే బాలుడికి తండ్రే సహజ సంరక్షకుడు అవుతాడని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
ముంబై: తల్లి చనిపోతే బాలుడికి తండ్రే సహజ సంరక్షకుడు అవుతాడని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి లేకపోయినా లేదా చని పోయినా వారి పిల్లలపై తండ్రికి సహజంగానే హక్కులు ఏర్పడతాయని పేర్కొంది. అమోల్ పవార్ అనే వ్యక్తి తన రెండున్నరేళ్ల కుమారుడ్ని వెనక్కి ఇవ్వడానికి తన మామ ఒప్పుకోవడంలేదని ఆరోపిస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా కోర్టు పైవిధంగా స్పందిం చింది. వివరాలిలా ఉన్నాయి.
అమోల్ పవార్‌కు, రమేష్ ధాత్రే కుమార్తెకు 2010 నవంబర్‌లో పెళ్లి జరిగింది. వారికి ఒక కుమారుడున్నాడు. కాగా, 2012 మార్చిలో ధాత్రే కుమార్తె కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమెను భర్తే నిప్పం టించి చంపేశాడని ఆరోపిస్తూ ధాత్రే కోర్టుకెళ్లాడు.పోలీసులు నిందితుడైన అమోల్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశా రు. కాగా రెండున్నర సంవత్సరాల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఇన్నిరోజుల పాటు తాతతో ఉన్న తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని అమోల్ కోరగా ధాత్రే నిరాకరించాడు.
దాంతో తన కుమారుడిని తనకు ఇప్పించాలని అమోల్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాడు. కే సు వాదోపవాదాలు విన్న తర్వాత బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.హర్‌దాస్, జస్టిస్ ఎ.ఎస్.గడ్కారీ మాట్లాడుతూ వెంటనే బాలుడిని తండ్రికి అప్పగించాలని తాతను ఆదేశించారు.