కామరాజర్ బాటలో కాంగ్రెస్
చెన్నై, సాక్షి ప్రతినిధి :మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ బాటలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని నటి కుష్బు పేర్కొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్బు శనివారం తొలిసారిగా చెన్నై సత్యమూర్తి భవన్‌కు చేరుకున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కుష్బు మీడియాతో మాట్లాడుతూ, పదవుల కోసం పార్టీ మారలేదు, తనకు ఏ పదవి ఇవ్వాలో సోనియా, రాహుల్‌కు తెలుసన్నారు.
ముంబైలో పుట్టి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను చూస్తూ పెరిగాను, అందరూ కాంగ్రెస్‌లో చేరుతానని అనుకున్నారు, కానీ మార్గమధ్యంలో దారితప్పి ఐదేళ్ల క్రితం వేరే పార్టీలో చేరానన్నారు. కాంగ్రెస్‌లో చేరిక సొంతింటికి వచ్చినట్లు ఉందని చెప్పారు. డీఎంకే-కాంగ్రెస్‌ల పొత్తు, ఆ పార్టీ నుంచి ఎందుకు వైదొలిగారు అనే ప్రశ్నలు అడగొద్దన్నారు. ఎందుకంటే అదే పార్టీ నుంచి వచ్చాను, ఎందుకు కాంగ్రెస్‌లోకి రావాల్సి వచ్చిందో అందరికీ తెలియాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మరింత పెంచగలనని నమ్మకం ఉందన్నారు. ఇందుకోసం ఇంటింటా తిరిగి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని తెలిపారు.
మూపనార్ ఖ్యాతి ఏమిటి? ఇళంగోవన్
ముఖ్యమంత్రి హోదాలో కామరాజనాడార్ రాష్ట్ర ప్రజలకు చిరస్మరణీయమైన సేవలు చేశారు, అందుకే ఆయన మాకు మార్గదర్శకుడని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ అన్నారు. అయితే జీకే మూపనార్ కాంగ్రెస్ పార్టీకీ, ప్రజలకు ఎటువంటి సేవలు అందించారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కామరాజనాడార్ ఫొటో లేకుండా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగవని, అలాగే మూపనార్ ఫోటో, పేరును ఎటువంటి పరిస్థితిలోనూ వినియోగించుకోమని చెప్పారు.
బీజేపీ చురకలు
డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఒక సాధారణ కార్యకర్త కుష్బుకు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ హితవు పలికారు. రాష్ట్రంలో ఒక్కస్థానంలో కూడా గెలవలేని కాంగ్రెస్ నేడు నిట్టనిలువునా చీలిపోగా ఆ పార్టీలో చేరిన కుష్బుకి బీజేపీని విమర్శించే స్థాయి లేదని చురకలంటించారు.