బోర్డు ఆదేశాలు పాటించాల్సిందే..
Published Fri, Oct 14 2016 12:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
-ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
- సాక్షితో డీఐఈవో ఏ. ప్రభాకర్ రెడ్డి
మంచిర్యాల సిటీ : ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, బోర్డు నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు కొందరు అర్హతలు లేని వారితో తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారం ఉందని, ఇప్పటికే ఒకసారి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసినట్లు మరోసారి తనిఖీ చేసే అవకాశాలున్నాయన్నారు. తనిఖీలో బోర్డు ఉత్తర్వులు పక్కకు పెట్టిన వారు గుర్తించిన నేపథ్యంలో కఠిన చర్యలు ఎంతటివారికైనా తప్పవని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి : జిల్లాలో కళాశాలలు ఎన్ని?
అధికారి : 10 ప్రభుత్వ, 32 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో పదివేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పరిధిలో మూడు సంక్షేమ, మూడు మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఏడు కళాశాలల్లో సైన్స్ తరగతులు, మూడింటిలో ఆర్ట్స్ తరగతులు నిర్వహిస్తున్నాం
సాక్షి : సౌకర్యాల పరిస్థితి ఎలా ఉంది?
అధికారి : అన్ని కళాశాలలకు బోధన సిబ్బందితోపాటు ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఆటస్థలం ఉంది. భోధనేతర సిబ్బందితోపాటు ప్రహారీ లేదు. ప్రహారీ నిర్మాణం కోసం నిధులు కొద్ది రోజుల్లోనే మంజూరు కానున్నాయి. ఫిజికల్ డెరైక్టర్ కూడా ఒక్క కళాశాలకు మాత్రమే ఉన్నారు. విద్యార్థులు ఆటలకు దూరమవుతున్న మాట వాస్తవమే.
సాక్షి : ఫలితాలు ఎంత శాతం సాధిస్తారు..?
అధికారి : ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. అర్హతగల అధ్యాపకులు ఉన్నారు కాబట్టి ప్రతి కళాశాలలో 80 శాతం పైబడి ఫలితాలు సాధిస్తాం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సాయంత్రంపూట నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సైన్స్ కళాశాలల్లో ఆసక్తి ఉన్నవారికి ఎంసెట్ ప్రవేశ పరీక్ష శిక్షణ తరగతులను కూడా ఉచితంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
సాక్షి : ప్రైవేటులో అర్హతల్లేనివారు బోధిస్తున్నారనే ఆరోపణలున్నాయి?
అధికారి : ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ పాటికే విజిలెన్స్‌శాఖ తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో అర్హతలు తక్కువ ఉన్నవారు తేలితే శాఖపరమైన చర్యలు తప్పవు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మరోసారి తనిఖీ చేసే అవకాశం కూడా ఉంది. అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే.
సాక్షి : అధిక ఫీజు వసూలు ఎలా అరికడతారు..?
అధికారి : ట్యూషన్ ఫీజుతోపాటు పరీక్ష ఫీజు కూడా అధికంగా తీసుకున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. అటువంటి కళాశాలలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం తప్పదు. ఎవరైనా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే నేరుగా నానెంబర్ 9440085109కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరించగలను. ప్రతి కళాశాల నిర్వహకులు సెలవులను పాటించాల్సిందే.
సాక్షి : మూల్యాంకనానికి ప్రైవేటు అధ్యాపకులు ఎందుకు రావడంలేదు?
అధికారి : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంకు ప్రైవేటు అధ్యాపకులు గతంలో రాలేదు. ఇకనుంచి కుదరదు. తప్పనిసరిగా బోర్డు ఉత్తర్వుల ప్రకారంరావాల్సిందే. అధ్యాపకులను పంపించని కళాశాలల గుర్తింపును రద్దు చేయడానికి బోర్డుకు అధికారం ఉంది. అధ్యాపకులను మూల్యాంకనంకు పంపకుండా, వేసవి సెలవుల్లో అడ్మీషన్‌ల ప్రచారానికి వాడుకుంటున్నట్టుగా సమాచారం ఉంది. ఇలాంటి పద్ధతులను మానుకోవాలి.
సాక్షి : పర్యవేక్షణలో రాజకీయ జోక్యం ఉంటుందా?
అధికారి : ఇంటర్‌బోర్డు కమిషనర్ ఆదేశాల ప్రకారం పనిచేస్తాం. రాజకీయ జోక్యంతో పనిచేస్తే విద్యావ్యవస్థ నాశనం అవుతుంది. ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు చేపడితే ఎక్కడ కూడా రాజకీయ జోక్యం కనబడలేదు. అటువంటి వాటికి ఆస్కారం ఉండదు. అదే విధంగా కళాశాలల సంఘాల జోక్యం ఉండదు. ఫలితాలు రాకుంటే ప్రభుత్వం అడుగుతుంది. కా బట్టి రాజకీయ జోక్యం ఎక్కడ కూడా కనబడదు. ఎవరైనా పేద విద్యార్థుల భవిష్యత్ కోసం కట్టుబడి ఉండాల్సిందే.
Advertisement
Advertisement