అక్రమాల కుప్పం | irregularities in kuppam branch canal tenders | Sakshi
Sakshi News home page

అక్రమాల కుప్పం

Published Sun, Sep 4 2016 1:25 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తవ్విన కాలువ - Sakshi

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తవ్విన కాలువ

బ్రాంచ్ కెనాల్ పనుల్లో భారీగా అవకతవకలు
టెండర్ల దశలోనే అంచనాలు పెంపు


సాక్షి, హైదరాబాద్:  ప్రభుత్వం ఉన్నది తమకు బాగా కావాల్సిన వారికి మేలు చేయడానికేనని పాలకులు భావిస్తున్నారు. ప్రజాధనం స్వాహా చేయడానికి నిబంధనలకే పాతరేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెగబడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో రూ.వందల కోట్లు కొట్టేయడానికి పెద్ద పథకమే వేశారు. ఈ పనులను ఏకపక్షంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టడంపై అదే జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అలకబూనారు. దాంతో ఆ పనుల్లో 50 శాతం వాటాను అనకధికారికంగా కట్టబెట్టి సీఎం రమేశ్‌ను శాంతింపజేశారు.

తాజాగా ఆ పనులపై ‘అధికార’ ముద్ర వేయాలంటూ జల వనరుల శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేశారనే అనుభవం చూపి మరికొన్ని కీలక పనులు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పలమనేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 6,300 ఎకరాలకు సాగునీరు, 4.03 లక్షల మందికి తాగునీటిని హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ నుంచి అందించాలని నిర్ణయించారు. ఇందుకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.8 కి.మీ. వద్ద నుంచి 143.90 కి.మీ.ల పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ తవ్వి, మూడు దశల్లో నీటిని ఎత్తిపోసి కుప్పం నియోజకవర్గానికి తరలించాలని నిర్ణయించారు.

అడ్డగోలుగా అంచనాలు పెంపు
కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో 98,85,140 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 3,84,457 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలి. మూడు పంప్ హౌస్‌లు, మోటార్లు, ప్రెజర్ మైన్‌లు అమర్చాలి. 2015-16 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం.. క్యూబిక్ మీటర్ మట్టి పనికి రూ.89, కాంక్రీట్ పనికి సగటున రూ.3 వేలను పరిగణనలోకి తీసుకుంటే 143.9 కిలోమీటర్లు తవ్వడానికి రూ.203.11 కోట్లు వ్యయం అవుతుంది. మూడు పంప్ హౌస్‌లు, మోటార్లు, ప్రెజర్ మైన్‌ల ఏర్పాటుకు రూ.90 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకే జలవనరుల శాఖ అధికారులు కుప్పం బ్రాంచ్ కెనాల్ తవ్వకానికి రూ.293 కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ, ‘ముఖ్య’ నేత ఒత్తిడితో అంచనాలను ఒకేసారి రూ.413 కోట్లకు పెంచేశారు.

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ‘ఆర్కే ఇన్‌ఫ్రా’ సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, గతేడాది ఆగస్టులో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగు శాతం ఎక్సెస్‌కు సింగిల్ షెడ్యూల్‌ను ఆ సంస్థ దాఖలు చేసింది. నిబంధనలకు పాతరేసి సింగిల్ షెడ్యూల్‌ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.430.29 కోట్లకు ఆ సంస్థకు పనులను కట్టబెట్టింది. అంచనా వ్యయాన్ని పెంచడం ద్వారా అస్మదీయునికి తొలిదశలోనే రూ.120 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.

సీఎం రమేశ్ పేచీతో పంపకాలు
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఆర్కే ఇన్‌ఫ్రాకు ఏకపక్షంగా కట్టబెట్టడంపై ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎంపీ సీఎం రమేశ్ అలిగారు. దీంతో ఈ పనుల్లో 50 శాతం వాటాను రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించి సీఎం రమేశ్‌ను చల్లార్చారు. అంటే.. 50 శాతం పనులను అనధికారికంగా రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చారన్న మాట. ప్రాజెక్టు పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించినా స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎస్‌ఎల్‌సీ) ఆమోదం తప్పనిసరి.  కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల విషయంలో ఇప్పటివరకూ ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఆమోదం పొందలేదు.

ఇదొక ఎత్తయితే, ఆ రెండు సంస్థలు మట్టి పనులను క్యూబిక్ మీటర్ రూ.40 చొప్పున ఎక్కడికక్కడ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేశాయి. మట్టి పనులు కొంత వేగంగా జరిగినా... కాంక్రీట్ పనుల్లో మాత్రం పురోగతి లేదు. 3.84 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనికిగాను 80,884 క్యూబిక్ మీటర్ల పని మాత్రమే పూర్తి చేశారు. రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పంప్ హౌస్‌ల నిర్మాణం చేస్తోంది. సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం ద్వారా.. తట్టెడు మట్టి ఎత్తకుండానే రూ.50 కోట్ల మేర ఆ రెండు సంస్థలు లబ్ధి పొందాయని జలవనరుల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.
 
ఇదేం పద్ధతి బాబూ!
ఒప్పందం ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లోగా పనులను పూర్తి చేయాలి. ఆ నిబంధన మేరకే గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌పై అనర్హత వేటు వేయడం ద్వారా ఫైనాన్షియల్ బిడ్‌కు ఆర్కే ఇన్‌ఫ్రాను ఎంపిక చేసి.. ఆ సంస్థకే పనులు కట్టబెట్టారు. కానీ,ఇప్పుడు ఆలోగా పనులు పూర్తి చేయలేరనే సాకు చూపి గడువు పొడగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇదే క్రమంలో అస్మదీయులకు గిట్టుబాటు కాని కాంక్రీట్ పనులను సెక్షన్- 60సీ కింద రద్దు చేసి.. మళ్లీ టెండర్ పిలవాలని ముఖ్య నేత సూచిస్తున్నారు. పనిలో పనిగా రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌ను అధికారికంగా సబ్ కాంట్రాక్టర్‌గా గుర్తించాలని ఒత్తిడి తెచ్చారు.

గత నెల 27న ఎస్‌ఎస్‌ఎల్‌సీ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు తిరస్కరించారు. కానీ, సీఎం ఒత్తిడి మేరకు ఈ నెల 8న మరోసారి ఎస్‌ఎస్‌ఎల్‌సీ సమావేశమై ఆ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుందని సమాచారం. దీనివల్ల పనుల అంచనా వ్యయం మరో రూ.100 కోట్లు పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement