ఐటీవో టన్నెల్ పూర్తి
Published Wed, Oct 2 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీవో మెట్రోస్టేషన్‌కి సంబంధించిన రెండో టన్నెల్ ఏర్పాటు మంగళవారం పూర్తయింది. మెట్రోఫేజ్-3లో భాగంగా సెంట్రల్ సెక్రెటేరియట్ నుంచి ఐటీవో వరకు నిర్మిస్తున్న టన్నెల్ పనులను డీఎంఆర్‌సీ ఎండీ మంగూసింగ్, ఇతర డెరైక్టర్లు పర్యవేక్షించారు. సొరంగం తవ్వకం పనులు విజయవంతంగా పూర్తవడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 700 మీటర్ల పొడవైన ఈ మార్గాన్ని మండీహౌస్ స్టేషన్ కిందిగా తవ్వారు. తిలక్ బ్రిడ్జి కిందిగా నిర్మిస్తున్న ఈ సొరంగ మార్గం భూఉపరితలం నుంచి 18 మీటర్ల లోతులో ఉన్నట్టు డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు. సొరంగం తవ్వేందుకు షాంగై మెట్రోషీల్డ్ కార్పొరేషన్ నుంచి తెప్పించిన భూమి పీడనాలు తట్టుకునే ప్రత్యేక టీబీఎం మిషన్‌ను వాడారు. 5.7 మీటర్ల వ్యాసంతో తవ్విన ఈ సొరంగ మార్గంలో 467 రింగ్‌లను ఉపయోగించినట్టు వెల్లడించారు.
సమయం మరింత ఆదా..
ఎన్‌సీఆర్‌లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ ఎన్‌సీఆర్‌లో మొట్టమొదటి ఇంటర్‌చేంజ్ మెట్రోస్టేషన్ రాబోతోంది. ఎన్‌సీఆర్‌లోని మెట్రో ప్రయాణికులకు మరింత సమయం ఆదా చేయడంతోపాటు మెట్రోరైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నిర్మించనున్న మెట్రోలైన్ నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. ఈ లైన్ నిర్మాణంతో దక్షిణ ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు తగ్గనున్నాయి. గుర్గావ్ వె ళ్లేందుకు సైతం అరగంట సమయం ఆదా అవుతుంది. 2016 వరకు ఈ లైన్ నిర్మాణం పూర్తవుతుందని డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఢిల్లీ బయట ఇంటర్‌చేంజ్ మెట్రోస్టేషన్ లేదు. మెట్రోరైలు మూడో ఫేజ్ నిర్మాణం పూర్తయితే నోయిడావాసులకు మరిన్ని ఇబ్బందులు తగ్గనున్నాయి. ఇంటర్‌చేంజ్ అయ్యేందుకు స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ కారిడర్‌లో నిర్మాణంతో నోయిడా నుంచి ఢిల్లీలోని కల్‌కాజీ, నెహ్రూ ప్లేస్, హజ్‌కాస్ ప్రాంతాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. మెట్రో అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)లో పేర్కొన్న ప్రకారం 2016 వరకు బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్ రోజుకు 97,980 మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రతిరోజూ 14 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చు. నోయిడా నుంచి గుర్గావ్ వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌కి వెళ్లి అక్కడి నుంచి గుర్గావ్ వెళ్లాల్సి వస్తోంది.
బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్ నిర్మాణంతో హజ్‌కాస్‌లో మెట్రోలైన్ మారి గుర్గావ్ వెళ్లొచ్చు. అధికారులు చెబుతున్న ప్రకారం ఇలా చేస్తే అరగంట వరకు సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం గుర్గావ్- హుడా సిటీ సెంటర్ లైన్‌లో నోయిడా నుంచి బొటానికల్ గార్డెన్ స్టేషన్ మధ్య ప్రయాణానికి గంటన్నర పడుతోంది. రాజీవ్ చౌక్‌లో మెట్రో మారడం తప్పనిసరి. పశ్చిమ జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ కారిడార్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సైతం ఓ స్టేషన్‌గా మారుతుంది. ఈ నిర్మా ణం పూర్తయితే బొటానికల్‌గార్డెన్ నుంచి ఎయిర్‌పోర్టుకి నేరుగా 45 నిమిషాల్లో చే రుకోగలుగుతారు. 2016 వరకు ఈ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఎంఆర్‌సీ అధికారి అనూజ్‌దయాల్ తెలిపారు.
Advertisement
Advertisement