వైభవంగా హులిగమ్మదేవి మహారథోత్సవం
దక్షిణ కర్ణాటకలో ఆదిశక్తి దేవతగా ప్రఖ్యాతి గాంచిన కొప్పళ జిల్లాలోని హులిగిలో వెలసివున్న హులిగమ్మదేవి మహారథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత ఘనం గా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారిని పూల మాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. అక్కిపడె తదితర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చారు.
అనంతరం అమ్మవారిని రథంపై ఉంచి రథాన్ని లాగారు. రథంపైకి భక్తులు పూలు, పండ్లను విసిరి మొక్కులు తీర్చుకొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. - హొస్పేట