తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంపై ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగానే కోవిడ్-19 కేసుల ఉధృతి పెరిగిందని ఇండియన్ సార్స్-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఉత్తర భారతదేశంతో పోలిస్తే కేరళ మెరుగ్గా ఉన్నా మతపరమైన సమావేశాలకు అనుమతించడం సరైన నిర్ణయం కాదని, కేరళ ప్రభుత్వం కేవలం అవసరమైన సేవలను మాత్రమే తిరిగి ప్రారంభించాల్సి ఉందని అగర్వాల్ వ్యాఖ్యానించారు. మతపరమైన సమావేశాలు, ధార్మిక సామూహిక కార్యక్రమాల కారణంగానే 13-20 వేల వరకు రోజువారి కేసులు పెరిగాయన్నారు. దీన్ని నివారించకపోతే కేసులు పెరుగుతూనే ఉంటుందని అగర్వాల్ హెచ్చరించారు. కేరళలో కరోనా కొత్త వేరియంట్ దేనినీ గర్తించనప్పటికీ, నమూనాల్లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేననని తేలిందన్నారు. దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోకరోనా మూడోదశ రావచ్చునని అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్నవారు మళ్లీ వైరస్‌కు గురి కారు కనుక మూడో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ తన రూపాన్ని మార్చుకుంటే ఈ ధోరణి మారుతుందని ఆయన హెచ్చరించారు.
ఆగస్టు 31 వరకు స్పెషల్ టీకా డ్రైవ్
మరోవైపు రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఎక్కువైమందికి టీకా అందించే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ టీకా డ్రైవ్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందన్నారు. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్‌లను ప్రజలకు అందించాలని వాణిజ్య, ప్రజా సంస్థలను విజయన్ పిలుపునిచ్చారు.
కాగా కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేవలం కేరళ రాష్ట్రం నుంచే 40 శాతానికి పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం ఆదివారం కేరళలో కొత్తగా 18,607 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 93 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు13.87 శాతానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment