సాక్షి, బళ్లారి: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారి దారితప్పి ఏకంగా కార్యాలయంలోనే ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడడం సంచలనమైంది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ గురుబసవరాజు రెండు నెలల క్రితం కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జోగ్‌ఫాల్స్ వద్ద టెక్కీ ఆత్మహత్యాయత్నం
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఇంజనీరు జలపాతం నుంచి దూకి ప్రాణాలు తీసుకోబోయాడు. పోలీసుల జోక్యంతో విరమించుకున్నాడు. బెంగళూరులో నివసించే టెక్కీ చేతన్ కుమార్‌కు ఇటీవల ఉద్యోగం పోయింది. దీంతో జీవితం మీద విరక్తి చెందిన శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జోగ్ జలపాతం నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధికారులు కళ్లుగప్పి జలపాతం ఎగువకు చేరుకున్నాడు. మొబైల్, లగేజ్ అన్నింటిని 960 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడేశాడు. ఇంతలో భద్రతా సిబ్బంది గమనించి అతన్ని వారించారు. ఇంతలో పోలీసులు కూడా చేరుకున్నారు. అందరూ దూరం నుంచే చేతన్‌తో మాట్లాడి వెనక్కి వచ్చేలా ఒప్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు చేతన్ జలపాతం నుంచి వెనక్కి రావడంతో కథ సుఖాంతమైంది.
అనూహ్య ప్రమాదం
సాక్షి, బళ్లారి: ఇనుప కడ్డీల లోడుతో నిలబడి ఉన్న లారీని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కండక్టర్ శరణప్ప (40) దేహంలోకి కడ్డీలు గుచ్చుకుని విలవిలలాడాడు. బుధవారం తెల్లవారుజామున బళ్లారి జిల్లా కూడ్లిగి సమీపంలోని జాతీయ రహదారి– 58 పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుష్టిగి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోతూ నిలిపిఉన్న ఇనుపరాడ్ల లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సులోకి కడ్డీలు చొచ్చుకుపోయాయి. కండక్టర్ దేహంలోకి చొచ్చుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గంటకుపైగా కండక్టర్ ఎటూ కదల్లేక నరకం అనుభవించాడు. 108 అంబులెన్స్, ఫైర్ సిబ్బంది వచ్చి కండక్టర్ శరీరం నుంచి కడ్డీలను కత్తిరించి బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment