రోజులు లెక్కపెట్టుకోండి..
'జైళ్లలో దురాగతాలు ఎక్కువైపోయాయి. ఖైదీల కష్టాలు పెరిగాయి. మీ ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. కోర్టులు పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. ఇక కాచుకోండి.. మా మిషన్ మొదలైంది.. రోజులు లెక్కపెట్టుకోండి' అంటూ అల్- ఖాయిదా పేరుతో పలువురు జైలు సూపరింటెండ్ లకు బెదిరింపు లేఖలు పంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ మేరకు కోయంబత్తూరు, తిరుచ్చి, మధురై, వేలూరు జైళ్ల సూపరింటెండ్లకు చేరిన లేఖలపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమది అల్ ఖాయిదా అనుబంధ 'ది బేస్ మూమెంట్' సంస్థ అని పేర్కొంటూ భారతదేశ అసంపూర్ణ చిత్రపటం, కింద ఒసామా బిన్ లాడెన్ ఫొటోతో లేఖను పంపారు. అన్ని లేఖలూ ఇలానే ఉండటం గమనార్హం. పోలీసుల దర్యాప్తులో ఫ్రమ్ అడ్రస్ లు తప్పుడువని తేలిసింది.
కాగా, కోయంబత్తూరు పేళుళ్ల కేసులో ప్రధాన నిందితులైన అల్ ఉమా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీస్ ఫక్రుద్దీన్, మున్నా సహా మరో ముగ్గురిని ఇటీవలే ఈ జైళ్లకు తరలించారు. గతంలో వారు పుళల్ సెంట్రల్ జైలులో ఉండగా.. సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కొని వారిపై దాడిచేసి గాయపర్చారు. దీంతో నిందితులను వేర్వేరు జైళ్లకు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు బెదిరింపు లేఖలు కూడా అవే జైళ్లకు రావడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.