చెన్నైలోని ఆర్‌కే నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జయలలిత గెలుపు అక్రమం అంటూ దాఖలయిన పిటిషన్ విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేస్తూ మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. జయలలితకు ప్రత్యర్థిగా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రవీణ ఈ కేసు వేశారు. ఇందులో రాష్ట్ర అసెంబ్లీకి గత మే 16వ తేదీన ఎన్నికలు జరిగాయని, ఆర్‌కే నగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేశారని తెలిపారు.
ఈ నియోజకవర్గంలో ఆమె 39 వేలకు పైగా ఓట్ల మెజారీటీతో గెలుపొందినట్లు ప్రకటించారని వివరించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓట్ల సేకరణకు అందరు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ముఖ్యంగా అధికారులు ముఖ్యమంత్రి జయలలితకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ కారణంగా జయలలిత గెలుపును రద్దు చేయాలన్నారు. న్యాయమూర్తి ఎం. దురైసామి సమక్షంలో విచారణ జరిగింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు, ముఖ్యమంత్రి జయలలిత తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు గడువు కోరారు. దీన్ని అంగీకరించిన న్యాయమూర్తి కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు.