అప్పీలు చేశారు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, 100 కోట్ల జరిమానా విధిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 27న తీర్పు చెప్పింది. జయతోపాటు ఆమె నెచ్చెలి శశికళ, మాజీ దత్తకుమారుడు సుధాకరన్, ఇళవరసిలకు సైతం తలా నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుపై జయ తదితరులు అప్పీలు కెళ్లగా అందరినీ నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు గత నెల 11వ తేదీన తీర్పు చెప్పింది.
కింది కోర్టులో జయ ఆస్తులను తప్పుగా లెక్కకట్టారని న్యాయమూర్తి కుమారస్వామి తీర్పులో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన ఈ కేసుపై వెలువడిన తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పీలుకు వెళ్లాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది బీపీ ఆచార్య ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు సైతం అప్పీలుపై పట్టుపట్టాయి. అప్పీలుపై చర్చలు జరుగుతుండగానే జయ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆర్కేనగర్ నుంచి అసెంబ్లీకి పోటీకి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా, ఈనెల 4వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమై జయ కేసులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించారు. అప్పీలు దాఖలు చేసే బాధ్యత ను ప్రభుత్వ న్యాయవాదులు బీపీ ఆచార్య, సంతోష్ గౌడలకు అప్పగించారు. అయితే అప్పీలు పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సెలవులో ఉంది. తాజా తీర్పు వెలువడిన 90 రోజుల్లోగా అప్పీలు చేయాల్సిన నిబంధన ఉన్నందున సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ లో మంగళవారం అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ఈ అప్పీలును స్వీకరించారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పనిచేస్తున్నందున ప్రధాన న్యాయమూర్తి దత్తు అప్పీలుపై నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటి నుంచి విచారణ ప్రారంభించేదీ, ఏఏ న్యాయమూర్తులు విచారణ చేస్తారో ఆయన ప్రకటిస్తారు. అప్పీలు పిటిషన్‌లో తమను కూడా చేర్చాల్సిందిగా కోరుతూ డీఎంకే పిటిషన్ దాఖలు చేయనుందని ఆ పార్టీ న్యాయవాది శరవణన్ తెలిపారు.
అమ్మ శిబిరంలో ఆందోళన:
తీర్పు వెలువడి నెలరోజులు దాటి పోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఇక అప్పీలుకు వెళ్లదని అంచనా వేసిన అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనలో పడిపోయారు. అయితే తాజా తీర్పు వెలువడిన 43 రోజుల తరువాత కర్ణాటక అప్పీలుకు వెళ్లింది. దేశ ఎన్నికల చరిత్రలోనే లేని విధంగా అమ్మకు అత్యధిక మెజార్టీ సాధించి పెట్టాలని మంత్రులు, నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 22వ తేదీన అమ్మ తన ప్రచారంలో సైతం రికార్డు మెజారిటీని ఆశిస్తున్నట్లు ఓటర్లను వేడుకున్నారు. మరో నాలుగురోజుల్లో ఆర్కేనగర్‌లో పోలింగ్ జరగనుండగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కావడం ఓటింగ్ సరళిపై ప్రభావం చూపితే ఎలా అనే ఆందోళన నెలకొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారంలో అప్పీలు అంశాన్ని విపక్షాలు ప్రచారానికి వాడుకోవచ్చని అంచనావేస్తున్నారు.
జయ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే:
జయ కేసులో కర్ణాటక ప్రభుత్వం అప్పీలు చేయడం పట్ల తమిళనాడులోని ప్రతిపక్షాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. అప్పీలు చేయాలనే కోర్కె ఒక్క డీఎంకేది మాత్రమే కాదు, ప్రజలందరిదీ అని పార్టీ కోశాధికారి స్టాలిన్ అన్నారు. ప్రజల కోర్కె నెరవేరిందని చెప్పారు. అప్పీలు పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించిన కారణంగా సీఎం పదవి నుంచి జయ తప్పుకోవాలని పీఎంకే అగ్రనేత డాక్టర్ రాందాస్ అన్నారు. సీఎంగా జయ ఇక రోజులు లెక్కపెట్టుకోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పీలు దాఖలులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు.