19న నిర్ణయం | Jayalalithaa, Sasikala fail to appear in court again | Sakshi
Sakshi News home page

19న నిర్ణయం

Published Tue, Apr 29 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

Jayalalithaa, Sasikala fail to appear in court again

చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ఎగ్మూరులోని ప్రత్యేక  కోర్టులో సోమవారం ఆదాయపు పన్ను కేసు విచారణకు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ గైర్హాజరయ్యూరు. వరుసగా గైర్హాజరవుతూ వస్తున్న వారిద్దరూ ఏ తేదీన హాజరుకావాలో వచ్చేనెల 19న నిర్ణయిస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి  కేసును వాయిదావేశారు. శశి ఎంటర్‌ప్రైజస్ పేరున జయలలిత, శశికళ భాగస్తులుగా సుమారు పాతికేళ్ల క్రితం ఒక సంస్థను స్థాపిం చారు. ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై 1991-94 మధ్య కాలం లో వారు ఆదాయపుపన్ను

 రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో ఆదాయపు పన్ను శాఖ జయ, శశిలపై కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తమకు విముక్తి ప్రసాదించాలని కోరుతూ తొలుత ఎగ్మూరు కోర్టును కోరారు. అయితే వీరి అభ్యర్థన కోర్టు నిరాకరించింది., ఆ తరువాత హైకోర్టులో కూడా అదే తీర్పు వెలువడగా సుప్రీంకోర్టుకు వెళ్లి జయ, శశిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దురదృష్టవశాత్తు అన్ని న్యాయస్థానాల్లోనూ చుక్కెదురైంది. అంతేగాక 15 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసుకు నాలుగు నెలల్లోగా ముగింపు పలకాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఆదేశించింది.
 
 సుప్రీం ఆదేశాలతో వరుసగా సాగిన రెండు వాయిదాలకు జయ, శశికళ హాజరుకాలేదు. వారివైఖరికి ఆగ్రహించిన ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి, సుప్రీం ఆదేశాలకు కట్టుబడి కేసు ముగింపునకు కక్షిదారులు సహకరించడం లేదంటూ కోర్టుకు ఫిర్యాదు చేశారు. గైర్హాజరీతో కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారంటూ ఆక్షేపించారు. మార్చి 10వ తేదీన జయ, శశి హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. యథా ప్రకారం ఆరోజు కూడా జయ, శశికళ హాజరుకాలేదు. నాలుగు నెలల గడువు కోరుతూ సుప్రీంలో తాము వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు జయ తర పు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి దక్షిణామూర్తి కేసు విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు సోమవారం ఆ కేసు విచారణకు వచ్చింది.
 
 అయితే మళ్లీ షరామామూలుగా వారిద్దరూ గైర్హాజరయ్యూరు. జయ తరపున హాజరైన పీ కుమార్, మణిశంకర్, సెంధిల్, అశోకన్, అలెక్స్, భరణికుమార్  వాదనను వినిపించారు. జూన్ 6వ తేదీ నుంచి మూడువారాలపాటూ గడువు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నామని, ఎన్నికలు పూర్తయిన తరువాత వారి హాజరీని నిర్ణయించాలని కోరారు. ఈనెల 24 వ తేదీతో పోలింగ్ పూర్తయినందున ఎన్నికలు ముగిసినట్లేనని ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రామస్వామి వాదించారు. పోలింగ్ ముగిసినా వచ్చే నెల 16వ తేదీన లెక్కింపు వరకు ఎన్నికల నిబంధనలను కొనసాగుతున్నట్లుగా భావించాలని జయ న్యాయవాదులు కోరారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి వచ్చేనెల 19 వ తేదీన వారిద్దరి హాజరీపై తేదీని నిర్ణయిస్తామని ప్రకటించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement