సర్వం సిద్ధం
- 22న శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
- 23న జయ ప్రమాణ స్వీకారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోసం నగరం సింగార చెన్నైగా మారిపోతోంది. అమ్మ సీఎంగా ఈనెల 23వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు సాగుతున్నాయి.ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి జయకు విముక్తి లభించిన రెండు వారాల తరువాత సీఎం పదవిని అధిష్టించడం అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
గత ఏడునెలలుగా విపక్షాల విమర్శలతో కృంగిపోయిన పార్టీ నేతలు, కార్యకర్తలు గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. ఈనెల 23వ తేదీన జయ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న పార్టీ అధికారికంగా ప్రకటించకున్నా నగరంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తే నిజమేనని నిర్ధారించాల్సి వస్తోంది. ఈనెల 22వ తేదీన శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించి ఉంది. ఈ సమావేశంలోనే జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని తెలిసింది.
జయ ఎన్నిక తరువాత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన పదవికి రాజీ నామా చేసి గవర్నర్‌కు సమర్పిస్తారు. పార్టీ నేతలు వెంటరాగా 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత నగరంలోని పెరియార్, అన్నాదురై, ఎంజీఆర్ విగ్రహాలకు జయ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడి టోరియంలో జయ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆడిటోరియం బయటా లోపలా రంగులువేసి తీర్చిదిద్దుతున్నారు.
22, 23వ తేదీల్లో అమ్మ పర్యటించే మార్గాలన్నీ శోభాయమానం చేస్తున్నారు. సచివాలయం, పార్టీ కార్యాలయానికి దారితీసే ప్రధాన రోడ్లన్నీ కొత్తగా కళకళలాడుతున్నాయి. పదవీ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై జయ ఆంతరంగిక సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, డీజీపీ అశోక్‌కుమార్, నగర కమిషనర్ జార్జ్ మంగళవారం రాత్రి సమావేశమై సమీక్షించారు. జయ పదవీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రవిశంకర ప్రసాద్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరవుతున్నట్లు అంచనా. జయతో పాటూ సుమారు 32 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.