
ప్రచార బాట
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుట్టనున్నారు. ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా శనివారం సాయత్రం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పర్యటించేందుకు తగ్గ ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన 75 ప్రచార రథాలు సిద్ధం చేశారు. ఈ వేదికపై 20 మంది అభ్యర్థులను జయలలిత పరిచయం చేయబోతున్నారు. మళ్లీ అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే శ్రేణులు పరుగులు తీస్తున్నారు. తమ అమ్మ జయలలిత రచించిన వ్యూహాల్ని అమలు పరిచే పనిలో పడ్డారు.
ఇక 227 స్థానాల్లో తమ అభ్యర్థులు, ఏడు స్థానాల్లో మిత్ర పక్ష అభ్యర్థులు బరిలోకి దిగడంతో అన్నాడీఎంకే ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థులందరూ రెండాకుల చిహ్నం మీద బరిలోకి దిగుతుండడంతో ఇక ప్రచార పోరు రసవత్తరం కానున్నది. అదే సమయంలో ఆరోసారిగా జయలలిత అభ్యర్థుల్ని మార్చడం ఆ పార్టీలో తీవ్ర గందరగోళం ఆయా నియోజకవర్గాల్లో నెలకొంది. శుక్రవారం కూడా అభ్యర్థులను మార్చారు. తిరుచ్చి పశ్చిమం అభ్యర్థి తమిళరసిని తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి, అక్కడ బరిలో ఉన్న ఆర్ మనోహరన్‌ను పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు.
అలాగే, రాధాపురం రేసులో జీడీ లారెన్స్‌ను తొలగించి ఇన్భదురైను అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థుల మార్పు పర్వం మరిన్ని రోజులు సాగనున్నదో అన్న ప్రశ్నబయలు దేరిన సమయంలో ఇక, ప్రచార బాటకు అమ్మ సిద్ధమయ్యారు.
అమ్మ ప్రచారం : క్లీన్ స్వీప్ లక్ష్యంగా, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఎన్నికల ప్రచారానికి జయలలిత సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో పార్టీ తరఫున ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభకు అన్నాడీఎంకే వర్గాలు సర్వం సిద్ధం చేశాయి.
ఈ వేదిక నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టనున్నారు. చెన్నైలో 16 నియోజకవర్గాలతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే మరో నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఈ వేదికపై పరిచయం చేయనున్నారు. అలాగే, ఇదే వేదిక మీద నుంచి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నారు. ఈ ప్రచారం తదుపరి రాష్ట్రవ్యాప్తంగా జయలలిత బహిరంగ సభల రూపంలో జయలలిత పర్యటన సాగనుంది.
విరుదునగర్, ధర్మపురి, అరుప్పుకోట్టై, కాంచీపురం, సేలం, తిరుచ్చి,మదురై, కోయంబత్తూరు, విల్లుపురం, పెరుంతురై, తంజావూరు, తిరునల్వేలి, వేలూరులో బహిరంగ సభలకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. మే 12 వ తేదీ వరకు ఈ పర్యటన సాగనుంది. ప్రతిరోజూ చెన్నై నుంచి హెలికాప్టర్ లేదా, విమానంలో బయలు దేరే జయలలిత, ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్ని ముగించుకుని అదే రోజు చెన్నైకు వచ్చేయడానికి తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకుని ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే సర్కారు ప్రగతి పథకాలు, అమ్మ మేనిఫెస్టోలోని అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తగ్గ ఎల్‌ఈడీ ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. 75 ప్రచార రథాలు శుక్రవారం పోయెస్ గార్డెన్‌కు చేరాయి. దీంతో ఆ మార్గం వెంబడి ఈ రథాలు బారులు తీరి ఉన్నాయి. వీటిని ప్రచార బహిరంగ సభలో జయలలిత జెండా ఊపి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సాగనంపనున్నారు. కోర్టుకు ‘వేదిక’ వివాదం : అన్నాడీఎంకే తొలి ప్రచార వేదిక వివాదానికి దారి తీసింది. ఐల్యాండ్ గ్రౌండ్‌లో పర్యాటక శాఖ నేతృత్వంలో ఎగ్జిబిషన్ జరిగింది.
గత నెల 24తో ఈ ప్రదర్శన ముగిసింది. ఇక్కడి స్టాల్స్‌ను తొలగించేందుకు 40 రోజుల వరకు గడువు ఉంది. అయితే, అమ్మ ప్రచార పర్యటన కోసం ఆ దుకాణాలను ఆగమేఘాలపై తొలగిస్తున్నారు. దీంతో గుడ్ వర్క్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాము సిద్ధం చేసి దుకాణాల్ని తొలగించేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి సుబ్బయ్య నేతృత్వంలోని బెంచ్ వివరణ ఇవ్వాలంటూ అధికారుల్ని ఆదేశించారు. అయితే, కోర్టు ఆదేశాలు బేఖాతరు అయ్యాయని చెప్పవచ్చు.
తమ దుకాణాల్ని తొలగిస్తున్న దృష్ట్యా, కోర్టు ధిక్కార కేసుకు చర్యలు చేపట్టనున్నామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అధికార జులుంతో ఐల్యాండ్ గ్రౌండ్‌ను ఖాళీ చేయిస్తున్న తొలి ప్రచార వేదిక వ్యవహారం కోర్టుకు చేరడం చర్చకు దారి తీసింది.