కార్యాలయాన్ని తక్షణమే అప్పగించాలని కాంగ్రెస్ నేతల పట్టు
పోలీసుల జోక్యంతో శాంతించినఇరు పార్టీల కార్యకర్తలు
బెంగళూరు : నిన్న మొన్నటి దాకా జేడీఎస్ ప్రధాన కార్యాలయం విషయమై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య రగిలిన చిచ్చు, ఇప్పుడిక షెడ్ నిర్మాణంతో మళ్లీ రాజుకుంది. నగరంలోని రేస్‌కోర్సు రోడ్డులో ఉన్న జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సిందిగా కోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో కార్యాలయం వెనక భాగంలో ఉన్న 16,100 అడుగుల స్థలంలో తాత్కాలికంగా ఓ షెడ్‌ను నిర్మించి, జేడీఎస్ కార్యకలాపాలను ఆ షెడ్‌లోకి మార్చిన అనంతరం ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ నిర్ణయించారు. ఇందులో భాగంగానే షెడ్ నిర్మాణ పనులు సైతం సాగుతున్నాయి. కాగా, ఇప్పుడు ఆ స్థలం కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందంటూ ఆ పార్టీ నేతలు జేడీఎస్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. జేడీఎస్ నేతలు షెడ్ నిర్మాణం తలపెట్టిన స్థలం సైతం ప్రధాన కార్యాలయం పరిధిలోనే ఉందని, అందువల్ల ఆ స్థలం కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని పేర్కొంటూ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేస్‌కోర్సు రోడ్డులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించారు.
అదే సందర్భంలో కార్యాలయ అప్పగింత విషయమై తమ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయాన్ని వెల్లడించే వరకు సహనం వహించాలంటూ జేడీఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం నడిచింది. ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పోట్లాటకు దిగడంతో కార్యాలయ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు అధికారులు కల్పించుకొని ఇరు పార్టీల కార్యకర్తలకు సర్దిచెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసు అధికారులు అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్.హనుమంతప్ప, ఆర్.వి.వెంకటేష్, పి.ఆర్.రమేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ తరహా ప్రవర్తన సరికాదు....
కాంగ్రెస్ పార్టీ నేతలు, జేడీఎస్ కార్యాలయాన్ని సొంతం చేసుకునేందుకు ఈ విధంగా దౌర్జన్యానికి దిగడం ఏ మాత్రం సరికాదని జేడీఎస్ పార్టీ అధికార ప్రతినిధి వై.ఎస్.వి.దత్త పేర్కొన్నారు. జేడీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా విషయం తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు ప్రాంతాల నేతలను సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...జేడీఎస్ పార్టీ నేతలు న్యాయవ్యవస్థకు ఎంతో విలువనిస్తారని, కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ఈ విధంగా కార్యాలయంలోకి చొరబడి స్వాధీనం చేసుకోవాలనుకోవడం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ బాహాబాహి
Published Fri, Jan 23 2015 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement