
త్వరలో జుడీషియల్ పోస్టుల భర్తీ
- కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్
- దేశ వ్యాప్తంగా 4,382 పోస్టులు ఖాళీ
- హైకోర్టుల్లో 25 శాతం సిబ్బంది పెంపునకు చర్యలు
- ఘనంగా ‘నేషనల్ లా స్కూల్’ స్నాతకోత్సవం
- పది బంగారు పతకాలు అందుకున్న విద్యార్థిని సాక్షి
సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4,382 జుడీషియల్ ఆఫీసర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు కేంద్ర న్యాయ, సాంకేతిక సమాచార శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ... దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ప్రస్తుతమున్న సిబ్బందిని మరో 25 శాతం వరకు పెంచనున్నట్లు చెప్పారు. అయా కోర్టుల్లో కేసు సంఖ్య పేరుకుపోతున్న కారణంగా కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు.
ప్రస్తుతం జైళ్లల్లో ఉన్న వారిలో 66శాతం మంది విచారణ ఖైదీలే కావడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది మానవ హక్కులకు తీవ్ర విఘాతం కల్పించడమే కాక న్యాయ వ్యవస్థకు సైతం పెద్ద సవాలువంటిదని అన్నారు. అందుకే విచారణ ఖైదీలుగా ఎక్కువ సమయం జైలులో గడిపిన వారి వివరాలను నమోదు చేసేందుకు గాను ‘ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్’(ఎన్‌ఐసీ)తో కలిసి ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా తీహార్‌జైల్లో అమలు చేసినట్లు తెలిపారు. అలాగే 14 వేల సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరణ చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధులైన న్యాయవాదుల జీవితాలు పాఠ్యాంశాలుగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు ఉండడం ఇప్పటి తరం లాయర్లకు ఎంతైనా గర్వకారణమని అన్నారు. బాలగంగాధర తిలక్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతోమంది న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని చెప్పారు. ఇలాంటి వారి జీవిత చరిత్రను నేటి తరం లాయర్లకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అందుకే వీరి జీవిత చరిత్రను న్యాయశాస్త్ర పాఠ్యాంశంలో చే ర్చే దిశగా విద్యావేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఘనంగా స్నాతకోత్సవం....
నగరంలోని ప్రముఖ న్యాయవిద్యా సంస్థ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో స్నాతకోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆదివారమిక్కడి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోథా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్టర్ ఆఫ్ లా, బీఏ ఎల్‌ఎల్‌బీ, పీజీ డిప్లొమా తదితర విభాగాల్లో మొత్తం 647 మంది డిగ్రీలను అందుకున్నారు. డిగ్రీలను పూర్తి చేసిన వారిని జస్టిస్ ఆర్.ఎం.లోథా పట్టాలను అందజేసి అభినందించారు.
అనంతరం ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. బీఏ ఎల్‌ఎల్‌బీ విభాగానికి చెందిన సాక్షి అత్యధికంగా పది బంగారు పతకాలు అందుకున్నారు. ఇక ఇదే విభాగానికి చెందిన జూహి గుప్తా ఆరు బంగారు పతకాలను అందుకోగా, వినోదినీ శ్రీనివాసన్ ఐదు, అభినవ్ సేక్రి నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే, హైకోర్టు న్యాయమూర్తులు, నేషనల్ లా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
పై చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్‌కు.....
బీఏ ఎల్‌ఎల్‌బీ విభాగంలో విద్యనభ్యసించి పది బంగారు పతకాలను అందుకున్న సాక్షి... ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడమే తన లక్ష్యమని తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన సాక్షి తండ్రి ఎస్‌బీఐలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి కన్నడ భాషా అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఓ గొప్ప న్యాయవాది కావాలని తాను ఆరాటపడ్డానని సాక్షి తెలిపారు. అందుకే గంటల పాటు లైబ్రరీలోనే గడిపేదానినని, ఇప్పుడు తన కల సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ బంగారు పతకాల ద్వారా వచ్చిన స్కాలర్‌షిప్‌లతో ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళుతున్నట్లు చెప్పారు.