అస్తమించిన బాలచంద్రుడు
భారత సినీ దర్శక శిఖరం కె.బాలచందర్ అస్తమించారు. కోలీవుడ్‌ను ద్రిగ్భాంతికి గురి చేసి అందనంత దూరాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చెన్నై నగరంలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని మైలాపూర్ లజ్ కార్నర్‌లోని నివాసంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
తమిళసినిమా:అనారోగ్యం కారణంగా ఈ నెల 15న బాలచందర్ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆయన కోలుకుంటారని భావించిన సినీలోకం మంగళవారం రాత్రి విషాద సమాచా రం అందుకోవాల్సి వచ్చింది. అందరికీ ఇక సెలవంటూ బాల చంద్రుడు అందనంత దూరాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం భారత సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తే, తమిళ సినీ పరిశ్రమను కన్నీటి సంద్రంలో ముంచింది. తమిళంలోనే కాదు, తెలుగు, హిందీ... పలు భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న శిఖరం బాలచందర్. అసాధారణ కథా చిత్రాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే సినిమాపై ఎనలేని మక్కువను పెంచుకున్న ఆయన 12 ఏళ్ల వయసులో రంగస్థలంపై అడుగుమోపారు.
1930 జూలై 9న తంజావూరు (తిరువారూరు)జిల్లా నన్నిలం గ్రామంలో జన్మించారు. చదువులో పట్టభద్రుడైన బాలచందర్ రంగస్థలం నుంచి సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1965లో తొలిసారిగా మెగాఫోన్ పట్టి ‘నీర్ కుమిళి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివంగత హాస్యనటుడు గణేష్ కథా నాయకుడిగా నటించారు. ఆ తరువాత మేజర్ చంద్రకాంత్, ఇరుకొడుగళ్, పూవా తలైవా, భామా విజయం, తామరై నెంజం, నాన్ అవనిల్లై, పున్నగై, సింధుభైరవి, అపూర్వ రాగంగళ్, తన్నీర్ తన్నీర్ ఇలా పలు చిత్రాలను తెరకెక్కించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు.
నేటి సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌లతో పాటుగా 50 మందికి పైగా నటీ నటుల్ని తెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్‌దే. కమలహాసన్, మాధవి తదితర పలువురిని బాలీవుడ్‌కు తీసుకెళ్లింది ఈ దర్శక శిఖరమే. ఆయన మృతి యావత్ భారత సీనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో పడేసింది. ఆయన మరణ సమాచారంతో అభిమానులు కన్నీటి మడుగులో మునిగారు. ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలి వచ్చినా, లోపలికి అనుమతించ లేదు. బాలచంద్రుడి భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.