Emergency treatment
-
ఆమె పూర్వానుభవం.. ఒక ప్రాణం నిలిపింది
వైరల్: ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవడం నిజంగా గొప్ప విషయం. కేవలం మానవ సంబంధాలతో సాయం చేసేవాళ్లను చూస్తే అభినందించకుండా ఉండలేం. అయితే.. ముప్పును అంచనా వేసి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు నిలబెట్టడం మరింత విశేషమే కదా. అలాంటి ఘటనే ఇది.. గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఇన్స్టాగ్రామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ఒక ఫ్యామిలీ ఓ రెస్టారెంట్లో తింటూ ఉంటారు. అందులో ఓ వ్యక్తికి గొంతులో ఏదో అడ్డం పడి.. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఏం జరిగిందంటూ ఆరా తీసే యత్నం చేస్తారు. అంతలో ఓ వెయిట్రెస్ అక్కడి రావడంతో.. ఆమెకు అతని పరిస్థితిని వివరిస్తారు. ఇంక.. క్షణం ఆలస్యం కూడా చేయకుండా ఆమె అతనికి యాంటీ చోక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. దీనినే హిమ్లిచ్ మనువహ్(heimlich maneuver) అంటారు. గొంతుకు ఏదైనా అడ్డం పడి.. శ్వాసకు ఇబ్బంది ఏర్పడిన తరుణంలో ఈ తరహా చికిత్స అందిస్తారు. తద్వారా అడ్డం పడ్డ వస్తువు బయటకు రావడం లేదంటే లోపలికి వెళ్లిపోవడం ద్వారా ఆ వ్యక్తికి ఉపశమనం కలిగి.. సాధారణ స్థితికి వచ్చాడు. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెను షీ(హీ)రోగా అభివర్ణిస్తున్నారంతా. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) కస్టమర్‌ను కాపాడిన ఆ వెయిట్రెస్ పేరు లేసీ గప్టిల్ అని.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా గతంలో పని చేసిన ఆమె సీపీఆర్‌తో పాటు హిమ్లిచ్ మనువర్లోనూ శిక్షణ తీసుకుందని తెలుస్తోంది. అమెరికన్ డాక్టర్ హెన్రీ హీమ్లిచ్ ఈ విధానానికి సృష్టికర్త కాగా.. ఆ పేరు మీదుగా ఈ అత్యవసర చికిత్సకు పేరొచ్చింది. గొంతులో ఏదైనా అడ్డం పడినప్పుడు.. ఉక్కిరిబిక్కిరి అయిన బాధితుడు ఊపిరి పీల్చుకోలేని స్థితిలో సాధారణంగా మాట్లాడలేడు. గొంతుపై రెండు చేతులను ఉంచి. సాయం కోసం వేడుకుంటాడు. అలాంటప్పుడు ఈ చికిత్సను చాలా జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది. -
ఫైజర్ టీకా వచ్చేసింది!
లండన్: ఫైజర్– బయో ఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్ఆర్ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు హెల్త్ సెక్రటరీ మాట్ హాంకాక్ చెప్పారు. టీకా అధ్యయనాల్లో 95 శాతం ప్రభావశీలత చూపిందన్నారు. టీకా పంపిణీ మంత్రి నదీమ్ మాట్లాడుతూ ‘‘ కరోనాపై పోరాటంలో ఇది అతిపెద్ద అడుగు’’ అన్నారు. కంపెనీ సమర్పించిన డేటా విశ్లేషణను నిపుణులు పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్‌కు ఉండాల్సిన ప్రమాణాలను, రక్షణ నియమాలను ఈ టీకా అందుకున్నట్లు ఎంహెచ్ఆర్ఏ భావించి, ప్రజల్లో వాడకానికి అనుమతినిచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీకాను ముందుగా తీసుకునే ప్రాధామ్య వర్గాలు(ప్రియారిటీ గ్రూప్స్) అనుసరించాల్సిన సూచనలను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. వైద్యులు, వయోవృద్ధుల్లాంటి వారిని ప్రాధామ్య వర్గాలుగా పరిగణిస్తారు. ‘‘వచ్చేవారం నుంచి యూకే మొత్తం టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. టీకా విజయవంతం కావాలంటే ప్రజలంతా తమకు నిర్ధేశించిన పాత్రను సమర్ధవంతంగా పోషించాలి’’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 4కోట్ల డోసులను ప్రభుత్వం ఆర్డరు చేసింది. వ్యాక్సినేషన్లో భాగంగా 21 రోజుల వ్యవధితో రెండుమార్లు టీకా ఇస్తారు. టీకాను అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడం అతిపెద్ద సవాలని హాంకాక్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ముందుగా 8 లక్షల వ్యాక్సిన్షాట్స్ అందుబాటులో ఉంటాయని, క్రమంగా నెలాఖరుకు మిగిలిన డోసులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. టీకాను ఫైజర్ ఎంత వేగంగా ఉత్పత్తి చేస్తే అంతవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. టీకాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషకరమైన అంశమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. రష్యాలో వ్యాక్సినేషన్ మాస్కో: ఒకవైపు ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలపగా, మరోవైపు స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్‌కు రష్యా అనుమతినిచ్చింది. వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. డిసెంబర్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. రష్యా 20 లక్షల డోస్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే లక్ష మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ చెప్పడం గమనార్హం. -
జాతీయ రహదారులపై.. ‘వైఎస్సార్ అత్యవసర చికిత్స’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంభవించే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్ వైఎస్సార్ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ ఏర్పాటుచేయనుంది. రాష్ట్రం మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులపై ఈ హైవే ఎమర్జన్సీ క్లినిక్‌లకు (హెచ్ఈసీ) శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 4,500 కి.మీ. మేర ఉన్న ఈ రహదారుల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక హెచ్ఈసీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలా మొత్తం 90 క్లినిక్‌లు ప్రారంభించనున్నారు. ఒక్కో క్లినిక్‌కు రూ.80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్‌లకు రూ.72 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిల్లో హెచ్ఈసీలో శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమిస్తారు. ఈ కేంద్రాలను 108 సర్వీసుతో అనుసంధానిస్తారు. సత్ఫలితాలివ్వని ట్రామా కేర్లు రాష్ట్రంలో చెన్నై–కోల్‌కత, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాల రేటు నమోదవుతోంది. వీటిపై గతంలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. ఫలితంగా జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తరచూ అనేకమంది క్షతగాత్రులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా, క్షతగాత్రుల కోసం గతంలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా 32 ట్రామాకేర్ ఆస్పత్రులు గుర్తించింది. వీటిలో 19 ప్రభుత్వాస్పత్రులు కాగా, 13 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే, రవాణా శాఖ గుర్తించిన ప్రైవేటు ట్రామాకేర్ ఆస్పత్రుల నిర్వాహకులు క్షతగాత్రులను చేర్చుకునేందుకు ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు కూడా సకాలంలో చికిత్స అందక తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు..రోడ్డు ప్రమాదానికి గురైన గంటలోపు (గోల్డెన్ అవర్) ఆస్పత్రిలో చేరిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే వీలుంది.కానీ, ట్రామాకేర్ ఆస్పత్రులలో సదుపాయాలు లేకపోవడంతో జనరల్ ఆస్పత్రుల్లో బాధితులు బెడ్లు లేక క్యాజువాలిటీలోనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కో జనరల్ ఆస్పత్రికి వస్తున్న కేసుల సంఖ్య రోజుకు ఎనిమిది నుంచి పది వరకు ఉంటున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు వీలుగా వైఎస్సార్ రహదారి చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. -
సొంత చాపర్‌లో గర్భిణిని ఆస్పత్రికి చేర్చిన గవర్నర్
ఇటానగర్: ఓ గర్భిణి కష్టాన్ని చూసి చలించిపోయారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా. గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకున్న మిశ్రా.. తన సొంత చాపర్‌లో ఆమెను ఆస్పత్రికి చేర్చి సకాలంలో వైద్యం అందేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యహ్నం మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూతో కలిసి తవాంగ్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని ఆమెను తవాంగ్ నుంచి ఇటానగర్‌కు తరలించడానికి హెలికాఫ్టర్ సర్వీస్‌లు కూడా అందుబాటులో లేవని స్థానిక ఎమ్మెల్యే సీఎంతో చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిశ్రా.. ఆ గర్భిణిని, ఆమె భర్తను తన హెలికాఫ్టర్‌లో ఇటానగర్‌కు తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు. అందుకోసం ఆయనతో పాటు ఉన్న అధికారుల్లో ఇద్దరి ప్రయాణాన్ని నిలిపివేశారు. అయితే మార్గమధ్యలో వారికి అవాంతరం ఎదురైంది. హెలికాఫ్టర్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఇంధనం నింపుకుని బయలుదేరే సమయంలో టేకాఫ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. గర్భిణి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని గమనించిన గవర్నర్ అక్కడి ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడి.. గర్భిణికి, ఆమె భర్తను ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇటానగర్‌కు తరలించారు. ఆ తర్వాత మరో హెలికాఫ్టర్‌లో గవర్నర్ రాజ్‌భవన్‌కు బయలుదేరారు. అంతేకాకుండా రాజ్‌భవన్ హెలిప్యాడ్‌లో గర్భిణి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ కాగానే.. అక్కడ అంబులెన్స్‌తో పాటు, ఓ మహిళ వైద్యురాలిని అందుబాటులో ఉండేలా మిశ్రా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆమెను హిమా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మిశ్రా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. తవాంగ్ నుంచి ఇటానగర్ మధ్య దూరం 200 కిలోమీటర్లు అయిప్పటికీ.. కొండ ప్రాంతం కావడంతో ప్రయాణ సమయం 15 గంటల పడుతుంది. కానీ గవర్నర్ చూపిన చొరవ వల్ల ఆ గర్భిణికి రెండు గంటల్లోనే వైద్యం అందింది. -
నొప్పుల ఇంజెక్షన్.. నోస్టాక్
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నొప్పుల ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. ప్రధానంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నొప్పుల నివారణకు గాను డైక్లోఫెనక్ ఇంజెక్షన్లు ఇస్తారు. రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా లేదు. కొన్నిచోట్ల ఈ ఇంజెక్షన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రలు అందజేస్తుండగా, మరికొన్ని చోట్ల అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోగులకు అవస్థలు తప్పటం లేదు. నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రతి నెల దాదాపు 60 వేల వరకు డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. వినియోగాన్ని బట్టి జిల్లాకు టీకాల సరఫరా ఉంటుంది. నిజామాబాద్‌లోని గంగాస్థాన్‌లో గల సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి రెండు జిల్లాలకు మందులు సరఫరా చేస్తారు. అయితే రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా నిలిచి పోయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 800 వరకు, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆరోగ్య కేంద్రాల్లో 200 నుంచి 300వరకు, కామారెడ్డిలో 500 వరకు డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. మిగతా ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ వీటి వినియోగం ఎక్కువే. ప్రస్తుతం ఈ టీకాలు అందుబాటులో లేక రోగులకు మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. నొప్పుల నివారణలో కీలకం.. డైక్లోఫెనక్ ఇంజెక్షన్‌ను ముఖ్యంగా నొప్పుల నివారణకు వినియోగిస్తారు. ప్రసవాలు, లేదా ఇతర ఆపరేషన్ అనంతరం నొప్పుల నివారణకు, అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి, జ్వరంతో వచ్చే నొప్పులకు కూడా ఈ డైక్లోఫెనక్ ఇంజెక్షన్లను వినియోగిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెరుగుతున్న ప్రసవాలు, ఇతర సాధారణ శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల సందర్భంలో రోగులకు నొప్పుల నివారణ ఇంజెక్షన్ ఎంతో ముఖ్యం. అయితే ఈ టీకాల కొరత ఉండడంతో ప్రస్తుతం ట్రామాడండల్ ఇంజెక్షన్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులో లేవు. ఈ టీకాలకూ కొరత ఉండడంతో, వీటిని కొనుగోలు చేస్తున్నారు. రెండునెలలుగా సరఫరా లేదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సలు జరిగేటప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంజెక్షన్లు వినియోగించాలంటే కొనుగోలు చేయాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు నొప్పుల ఇంజెక్షన్ ఇవ్వడానికి టీకాలు అందుబాటులో లేవంటున్నారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్య ఉండడంతో జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. త్వరలో వస్తాయి.. డైక్లోఫెనక్ ఇంజెక్షన్ల సరఫరాకు సంబంధించి ఇదివరకే అధికారులకు నివేదించాం. త్వరలోనే జిల్లాకు టీకాలు వస్తాయి. కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు సంబంధించి సరిపోయేంత ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతాం. - జైపాల్‌రెడ్డి, ఈఈ, కేంద్ర ఔషధ గిడ్డంగి, నిజామాబాద్ -
అత్యవసర వైద్యంపై వర్క్‌షాప్
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఎమర్జన్సీ అండ్ క్రిటికేర్ వైద్యంలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను వివరించేందుకు ఎనిమిదవ జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజు ప్రాణాప్రాయ, అత్యవసర వైద్యసేవలపై వర్క్‌షాపు నిర్వహించారు. íపీడియాట్రిక్ ఎమర్జన్సీ రీసెర్చి మెథడాలజీ, పీడియాట్రిక్, అడల్డ్ క్రిటికల్ కేర్ అంశాలను యువ వైద్యులకు వివరించారు. అమెరికాకు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ అజయ్‌లు వైద్య విద్యార్థులకు పరిశోధనల కోసం పేపర్లు ఎంపిక చేసే విధానం, పేపర్ ప్రజెంటేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చండ్ర రాధికారాణి, డాక్టర్ చంద్రశేఖర్‌లు బేసిక్లైఫ్ సపోర్ట్ గురించి, ట్రామా, ఎమర్జన్సీ ట్రీట్మెంట్లో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతుల గురించి వర్క్‌షాపులో వివరించారు. కాగా ఈ సదస్సును శనివారం సాయంత్రం వైద్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మళ్లీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధికారాణి తెలిపారు. -
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనలు తరచుగా జరుగుతున్నా... అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కనిపించరు.. అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళల్లో మరీ ఘోరం... పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. -
ఊపిరి తీసే ఆస్పత్రులు
వెంటిలేటర్లు లేక ఒక్క నెలలో 3,200 మంది మృతి ♦ రాష్ర్టంలోని పెద్దాసుపత్రుల్లో మరణమృదంగం.. ♦ మృతుల్లో చిన్నారుల సంఖ్య అధికం (గుండం రామచంద్రారెడ్డి) పెద్దాసుపత్రికి వెళితే పోయే ప్రాణాలు నిలబెడతారని ఆశిస్తాం... కానీ ఆంధ్రప్రదేశ్‌లో అది తిరగబడింది. పెద్దాసుపత్రుల్లో... ఉన్న ప్రాణాలు కాస్తా ఊడగొడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు వెంటిలేటర్లు అందుబాటులో లేక కన్నుమూస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే రాష్ర్టంలోని 11 పెద్దాసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత వల్ల 3,200 మంది మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్య శాఖ పనితీరు కీలక నివేదికలలో ఈ విషయం బైటపడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లు శ్వాస తీసుకోలేని సందర్భాలలో వారికి వైద్యం చేయాలంటే వెంటిలేటర్ల ద్వారా కృత్రిమ శ్వాస అందించడం అత్యవసరం. కానీ రాష్ర్టంలోని పెద్దాసుపత్రుల్లో అవసరానికి తగినన్ని వెంటిలేటర్లు లేవు సరికదా.. ఉన్న వాటిలో కూడా చాలావరకు సరిగా పనిచేయడం లేదు. దాంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క నెలలో 3,200 మంది మరణించడానికి వెంటిలేటర్ల కొరతే కారణమన్న వాస్తవం కళ్లెదురుగా కనిపిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్లలో తీవ్రగాయాలపాలైనవారు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు, వడదెబ్బ, డయేరియా తదితర రోగ లక్షణాలతో పెద్దాసుపత్రుల్లోని అత్యవసర విభాగాల్లోకి చేరుతున్న వారిని వెంటిలేటర్ల లేమి ఆందోళన కలిగిస్తోంది. వెంటిలేటర్ల సంఖ్య పెంచడానికి ప్రయత్నాలు జరిగినా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అడ్డుకున్నారని వైద్యశాఖ వర్గాలంటున్నాయి. తాను చెప్పిన వారికి వెంటిలేటర్ల కాంట్రాక్టు దక్కక పోవడం వల్ల మొత్తం కొనుగోళ్లనే మంత్రిగారు ఆపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగినన్ని వెంటిలేటర్లు ఎక్కడ? రాష్ర్టంలో 11 బోధనాసుపత్రులున్నాయి. ఒక్కో బోధనాసుపత్రికి నెలకు 3 వేల నుంచి 4 వేల వరకూ ఇన్‌పేషెంట్లు వస్తూంటారు. వీరిలో ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలో వైద్యానికి వచ్చేవారే ఉంటారు. పైగా వీళ్లంతా నిరుపేదలు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నవారు. జిల్లా ఆస్పత్రుల్లో నామమాత్రంగా కూడా వెంటిలేటర్లు లేవు. బోధనాసుపత్రుల్లో చాలినన్ని వెంటిలేటర్లు లేవు. రోజుకు సగటున 35 మంది రోగులకు వెంటిలేటర్ చికిత్స అవసరమవుతుంటుంది. కానీ ఐదుగురికి కూడా అందించలేని పరిస్థితి ఉంది. వెంటిలేటర్ కోసం డిమాండ్ ఉండడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సిఫార్సు చేస్తున్న పరిస్థితి. వెంటిలేటర్ల కొనుగోళ్లు మంత్రి ఆపేశారు రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రులకు దాదాపు 30 వెంటిలేటర్లు సరఫరా చేయడం కోసం ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. టెండర్లు పూర్తయి కొనుగోళ్లకు ఆర్డరు ఇచ్చే సమయంలో స్వయానా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏపీఎంఎఎస్ఐడీసీ ఎండీకి ఫోన్ చేసి ఆపేయమన్నారని సమాచారం. ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, వీటిని తక్షణమే ఆపేయాలని ఫోన్ ద్వారా ఆదేశించారని తెలిసింది. దాంతో కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇప్పటి వరకూ వెంటిలేటర్ల ఊసెత్తినవారే లేదు. మంత్రిగారు చెప్పిన వారికి టెండర్ దక్కకపోవడం వల్లే కొనుగోళ్లు ఆపించారన్న ఆరోపణలు వైద్య ఆరోగ్యశాఖలో వినిపిస్తున్నాయి. మృతులలో చిన్నారులే అధికం... అత్యవసర చికిత్సకు వస్తున్న వాళ్లలో వెంటిలేటర్ల కొరత కారణంగా మృతి చెందినవారిలో చిన్నారుల సంఖ్య అధికంగా ఉండడం మరింత విచారకరం. మార్చి నెలలో పెద్దాసుపత్రుల్లో మరణించినవారిలో ఐదేళ్లలోపు చిన్నారులు వందలాది మంది ఉన్నారు. ఇక ఇంటెన్సివ్ కేర్ విభాగాలలో ఉన్న అరకొర వెంటిలేటర్లలోనూ పనిచేయనివి పదుల సంఖ్యలో ఉన్నాయి. అసలే వేసవి మండిపోతున్న నేపథ్యంలో డయేరియా, జ్వరాలు, వడదెబ్బ బాధితులకు అత్యవసర చికిత్స అవసరమౌతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం పేదరోగులను నేరుగా మృత్యుకౌగిలిలోకి నెట్టివేస్తున్నట్టు బాధితుల రోదనలు చెబుతున్నాయి. ఎమర్జెన్సీ కేసుల్లో 2 నుంచి 3 శాతం మరణాలు సర్వ సాధారణం. కానీ పెద్దాసుపత్రుల్లో 10 శాతానికి పైగా మరణాలు ఉండడానికి వెంటిలేటర్ల కొరతే కారణమని వేరే చెప్పనక్కరలేదు. వెంటిలేటర్ చికిత్స అంటే... ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్వాస తీసుకోలేనప్పుడు, లేదా ఏదైనా జబ్బు పడి నిస్సత్తువగా ఉండి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యం చేస్తారు. జబ్బు నయమై పేషెంటు కోలుకునే వరకూ ఇలా కృత్రిమ శ్వాస అందిస్తారు. ఈ పేషెంట్లను విధిగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోనే ఉంచాలి. పర్యవేక్షణ స్థాయిని బట్టి 98 శాతం మంది రోగులను బతికించే అవకాశముంది. వెంటిలేటర్ చికిత్సలో ఉండే రోగులకు భారతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం ఒక్కో బెడ్డుకు ఒక నర్సు ఉండాలి. ప్రభుత్వాసుపత్రుల్లో 10 బెడ్లకు ఒక నర్సు ఉన్నారు. పైగా వెంటిలేటర్ చికిత్సలో ఉన్న రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ రోగికి ఆక్సిజన్ శాతం అందిస్తున్న తీరు, రక్తపోటు, షుగర్ లెవెల్స్ వంటివన్నీ పరిశీలించేందుకు మల్టీ పారామీటర్స్‌తో పర్యవేక్షణ ఉండాలి. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో మల్టీపారామీటర్లే కరువయ్యాయి. అంతేకాదు పేషెంటు స్థితిని బట్టి గంటకు 2 మిల్లీ లీటర్ల నుంచి 30 మిల్లీ లీటర్ల వరకూ వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. ఇంత స్లోగా ఆక్సిజన్ ఇవ్వడమంటే నర్సులకు పెద్ద పరీక్షే.ఇప్పుడు అధునాతన ఇన్ఫ్యూజన్ పంప్స్ వచ్చేశాయి. దానిని ఒకసారి అమరిస్తే అదే రోగికి అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఒక ప్రభుత్వాసుపత్రిలో 20 మంది వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటుంటే ఒకటో రెండో ఇన్ఫ్యూజన్ పంప్స్ ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు హరిస్తున్న సర్కారు ఆసుపత్రులు ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులు అధికసంఖ్యలో మరణిస్తుండడానికి కారణాలనేకం..అత్యవసర చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు సరిపడినన్ని ఉండడం లేదు.ప్రమాదంలో తీవ్రంగా గాయలాపాలై వచ్చే రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. ► అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ► అత్యవసర మందులూ అందుబాటులో ఉండ డం లేదు. రోగులకు సరిపడా పడకలు లేవు రోగులను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు, ట్రాలీలు లేక చేతుల మీదనే తీసుకెళుతున్న దుస్థితి వైద్య పరికరాల కొనుగోళ్లలో మితిమీరిన అవినీతి కారణంగా...వసతుల కల్పనలోనూ జాప్యం జరుగుతోంది. ► 2015-16 బడ్జెట్లో ఔషధాలకు రూ.162 కోట్లు కేటాయించినా రూ.82 కోట్లు ఖర్చు చేయలేదు. ఒకవైపు ఔషధాలు లేక పేద రోగులు అల్లాడుతున్నా, బడ్జెట్ నిధులున్నా ఔషధాలు కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో ఉంచలేదంటే ప్రజారోగ్యం విషయంలో సర్కారు నిర్లక్ష్యం అంచనా వేయొచ్చు. -
అస్తమించిన బాలచంద్రుడు
భారత సినీ దర్శక శిఖరం కె.బాలచందర్ అస్తమించారు. కోలీవుడ్‌ను ద్రిగ్భాంతికి గురి చేసి అందనంత దూరాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చెన్నై నగరంలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని మైలాపూర్ లజ్ కార్నర్‌లోని నివాసంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. తమిళసినిమా:అనారోగ్యం కారణంగా ఈ నెల 15న బాలచందర్ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆయన కోలుకుంటారని భావించిన సినీలోకం మంగళవారం రాత్రి విషాద సమాచా రం అందుకోవాల్సి వచ్చింది. అందరికీ ఇక సెలవంటూ బాల చంద్రుడు అందనంత దూరాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం భారత సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తే, తమిళ సినీ పరిశ్రమను కన్నీటి సంద్రంలో ముంచింది. తమిళంలోనే కాదు, తెలుగు, హిందీ... పలు భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న శిఖరం బాలచందర్. అసాధారణ కథా చిత్రాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే సినిమాపై ఎనలేని మక్కువను పెంచుకున్న ఆయన 12 ఏళ్ల వయసులో రంగస్థలంపై అడుగుమోపారు. 1930 జూలై 9న తంజావూరు (తిరువారూరు)జిల్లా నన్నిలం గ్రామంలో జన్మించారు. చదువులో పట్టభద్రుడైన బాలచందర్ రంగస్థలం నుంచి సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1965లో తొలిసారిగా మెగాఫోన్ పట్టి ‘నీర్ కుమిళి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివంగత హాస్యనటుడు గణేష్ కథా నాయకుడిగా నటించారు. ఆ తరువాత మేజర్ చంద్రకాంత్, ఇరుకొడుగళ్, పూవా తలైవా, భామా విజయం, తామరై నెంజం, నాన్ అవనిల్లై, పున్నగై, సింధుభైరవి, అపూర్వ రాగంగళ్, తన్నీర్ తన్నీర్ ఇలా పలు చిత్రాలను తెరకెక్కించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. నేటి సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌లతో పాటుగా 50 మందికి పైగా నటీ నటుల్ని తెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. కమలహాసన్, మాధవి తదితర పలువురిని బాలీవుడ్‌కు తీసుకెళ్లింది ఈ దర్శక శిఖరమే. ఆయన మృతి యావత్ భారత సీనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో పడేసింది. ఆయన మరణ సమాచారంతో అభిమానులు కన్నీటి మడుగులో మునిగారు. ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలి వచ్చినా, లోపలికి అనుమతించ లేదు. బాలచంద్రుడి భౌతిక కాయాన్ని ఆయన స్వగృహంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. గురువారం భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
మహిళపై కత్తులతో దుండగుల దాడి, పరిస్థితి విషమం
కరీంనగర్: దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒంటిరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్‌లో జ్యోతి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. జ్యోతి పరిస్థితి విషమించడంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చికిత్స ‘అత్యవసరం’...
జీజీహెచ్ దుస్థితి = క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల కొరత = పనిచేయని వాల్ సెక్షన్స్ ఆపరేటర్స్ = అరకొర మందులతో ఇబ్బందులు కొన ఊపిరితో వచ్చిన వారి ప్రాణాలు నిలపాల్సిన ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగానికే సుస్తీ చేసింది. అవసరమైన మందులు, సిబ్బంది కొరత.. రాత్రి వేళల్లో పనిచేయని సీటీస్కాన్.. అందుబాటులో లేని 24 గంటల లేబరేటరీలతో సకాలంలో చికిత్స అందించలేక చేతులెత్తేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తొలుత ఇక్కడకు వచ్చిన ప్రమాద బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. విజయవాడ, న్యూస్‌లైన్ : జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి నిత్యం వందలాదిమంది రోగులు అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో చికిత్స అందించలేక పోతున్నారు. ఇటీవల గుడ్లవల్లేరు మండలం అంగలూరు మోడల్హాస్టల్ విద్యార్థినులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురికాగా, వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వారికి అత్యవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అర్ధరాత్రి వేళ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటికయితే కొన్నారు కానీ, సాధారణ రోగులు వస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదానికి గురికాగా, ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు రిఫర్ చేశారు. అర్ధరాత్రి వేళ వచ్చిన యువకుడిని పరీక్షించిన వైద్యులు తలకు సీటీ తీయాలని చెప్పారు. అయితే రాత్రివేళల్లో లేబరేటరీ అందుబాటులో లేకపోవడంతో గుంటూరు ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో రూ.రెండువేలు వెచ్చించి అంబులెన్స్‌లో గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యకృత్యం. అందుబాటులోకి రాని వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. పేరుకు పెద్దాస్పత్రే అయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉదయం వేళల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రోగి ఆస్పత్రికి వస్తే వారికి అత్యవసరంగా అవసరమైన నిర్ధారణ పరీక్షలన్నీ వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు ల్యాబుల్లో చేయించాల్సిందే. గాయాలతో వచ్చిన వారికి చికిత్స చేయాలని, అత్యవసర ఆపరేషన్లు నిర్వహించాలన్నా హెచ్ఐవీ, హెపటైటీస్ బీ వంటి పరీక్షలు ఖచ్చితంగా చేయాల్సి ఉంది. అయితే 24 గంటల లేబరేటరీల సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రోగులు వేలాది రూపాయలను కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సి వస్తుంది. సీఎంవోల కొరత ...డీఎంఈ ఆదేశాలు భేఖాతర్... అత్యవసర చికిత్స విభాగంలో కనీసం 10 మందికి పైగా వైద్యులుండాలి . కానీ వారిలో సగం మంది కూడా లేకపోడంతో మూడు నెలలుగా వైద్యులకు సెలవులు ఇవ్వడం లేదు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు తరచూ కోర్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో మరీ ఇబ్బందిగా ఉంటుంది. సీఎంవోల కొరత విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యూ సూర్యకుమారి రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి తీసుకెళ్లడంతో సిద్ధార్థ వైద్య కళాశాలలో ట్యూటర్లుగా ఉన్న ఏడుగురిని సీఎంవోలుగా డెప్యూట్ చేయాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశాలొచ్చాయి. కానీ వారిలో ఇద్దరిని అప్పటికే డెప్యూట్చేయగా, మిగిలిన ఐదుగురిని ప్రిన్సిపాల్ డెప్యూట్ చేయక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఆచరణకు నోచెకోక పోవడంపై పలువురు వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో ఒకరికి పదోన్నతి లభించి రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు.అప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.