ఊపిరి తీసే ఆస్పత్రులు
వెంటిలేటర్లు లేక ఒక్క నెలలో 3,200 మంది మృతి
♦ రాష్ర్టంలోని పెద్దాసుపత్రుల్లో మరణమృదంగం..
♦ మృతుల్లో చిన్నారుల సంఖ్య అధికం
(గుండం రామచంద్రారెడ్డి)
పెద్దాసుపత్రికి వెళితే పోయే ప్రాణాలు నిలబెడతారని ఆశిస్తాం... కానీ ఆంధ్రప్రదేశ్‌లో అది తిరగబడింది. పెద్దాసుపత్రుల్లో... ఉన్న ప్రాణాలు కాస్తా ఊడగొడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్‌లు వెంటిలేటర్లు అందుబాటులో లేక కన్నుమూస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే రాష్ర్టంలోని 11 పెద్దాసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత వల్ల 3,200 మంది మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్య శాఖ పనితీరు కీలక నివేదికలలో ఈ విషయం బైటపడింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లు శ్వాస తీసుకోలేని సందర్భాలలో వారికి వైద్యం చేయాలంటే వెంటిలేటర్ల ద్వారా కృత్రిమ శ్వాస అందించడం అత్యవసరం. కానీ రాష్ర్టంలోని పెద్దాసుపత్రుల్లో అవసరానికి తగినన్ని వెంటిలేటర్లు లేవు సరికదా.. ఉన్న వాటిలో కూడా చాలావరకు సరిగా పనిచేయడం లేదు. దాంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క నెలలో 3,200 మంది మరణించడానికి వెంటిలేటర్ల కొరతే కారణమన్న వాస్తవం కళ్లెదురుగా కనిపిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్లలో తీవ్రగాయాలపాలైనవారు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు, వడదెబ్బ, డయేరియా తదితర రోగ లక్షణాలతో పెద్దాసుపత్రుల్లోని అత్యవసర విభాగాల్లోకి చేరుతున్న వారిని వెంటిలేటర్ల లేమి ఆందోళన కలిగిస్తోంది. వెంటిలేటర్ల సంఖ్య పెంచడానికి ప్రయత్నాలు జరిగినా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అడ్డుకున్నారని వైద్యశాఖ వర్గాలంటున్నాయి. తాను చెప్పిన వారికి వెంటిలేటర్ల కాంట్రాక్టు దక్కక పోవడం వల్ల మొత్తం కొనుగోళ్లనే మంత్రిగారు ఆపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తగినన్ని వెంటిలేటర్లు ఎక్కడ?
రాష్ర్టంలో 11 బోధనాసుపత్రులున్నాయి. ఒక్కో బోధనాసుపత్రికి నెలకు 3 వేల నుంచి 4 వేల వరకూ ఇన్‌పేషెంట్లు వస్తూంటారు. వీరిలో ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలో వైద్యానికి వచ్చేవారే ఉంటారు. పైగా వీళ్లంతా నిరుపేదలు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నవారు. జిల్లా ఆస్పత్రుల్లో నామమాత్రంగా కూడా వెంటిలేటర్లు లేవు. బోధనాసుపత్రుల్లో చాలినన్ని వెంటిలేటర్లు లేవు. రోజుకు సగటున 35 మంది రోగులకు వెంటిలేటర్ చికిత్స అవసరమవుతుంటుంది. కానీ ఐదుగురికి కూడా అందించలేని పరిస్థితి ఉంది. వెంటిలేటర్ కోసం డిమాండ్ ఉండడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సిఫార్సు చేస్తున్న పరిస్థితి.
వెంటిలేటర్ల కొనుగోళ్లు మంత్రి ఆపేశారు
రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రులకు దాదాపు 30 వెంటిలేటర్లు సరఫరా చేయడం కోసం ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. టెండర్లు పూర్తయి కొనుగోళ్లకు ఆర్డరు ఇచ్చే సమయంలో స్వయానా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏపీఎంఎఎస్‌ఐడీసీ ఎండీకి ఫోన్ చేసి ఆపేయమన్నారని సమాచారం. ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, వీటిని తక్షణమే ఆపేయాలని ఫోన్ ద్వారా ఆదేశించారని తెలిసింది. దాంతో కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇప్పటి వరకూ వెంటిలేటర్ల ఊసెత్తినవారే లేదు. మంత్రిగారు చెప్పిన వారికి టెండర్ దక్కకపోవడం వల్లే కొనుగోళ్లు ఆపించారన్న ఆరోపణలు వైద్య ఆరోగ్యశాఖలో వినిపిస్తున్నాయి.
మృతులలో చిన్నారులే అధికం...
అత్యవసర చికిత్సకు వస్తున్న వాళ్లలో వెంటిలేటర్ల కొరత కారణంగా మృతి చెందినవారిలో చిన్నారుల సంఖ్య అధికంగా ఉండడం మరింత విచారకరం. మార్చి నెలలో పెద్దాసుపత్రుల్లో మరణించినవారిలో ఐదేళ్లలోపు చిన్నారులు వందలాది మంది ఉన్నారు. ఇక ఇంటెన్సివ్ కేర్ విభాగాలలో ఉన్న అరకొర వెంటిలేటర్లలోనూ పనిచేయనివి పదుల సంఖ్యలో ఉన్నాయి. అసలే వేసవి మండిపోతున్న నేపథ్యంలో డయేరియా, జ్వరాలు, వడదెబ్బ బాధితులకు అత్యవసర చికిత్స అవసరమౌతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం పేదరోగులను నేరుగా మృత్యుకౌగిలిలోకి నెట్టివేస్తున్నట్టు బాధితుల రోదనలు చెబుతున్నాయి. ఎమర్జెన్సీ కేసుల్లో 2 నుంచి 3 శాతం మరణాలు సర్వ సాధారణం. కానీ పెద్దాసుపత్రుల్లో 10 శాతానికి పైగా మరణాలు ఉండడానికి వెంటిలేటర్ల కొరతే కారణమని వేరే చెప్పనక్కరలేదు.
వెంటిలేటర్ చికిత్స అంటే...
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్వాస తీసుకోలేనప్పుడు, లేదా ఏదైనా జబ్బు పడి నిస్సత్తువగా ఉండి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యం చేస్తారు. జబ్బు నయమై పేషెంటు కోలుకునే వరకూ ఇలా కృత్రిమ శ్వాస అందిస్తారు. ఈ పేషెంట్లను విధిగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోనే ఉంచాలి. పర్యవేక్షణ స్థాయిని బట్టి 98 శాతం మంది రోగులను బతికించే అవకాశముంది. వెంటిలేటర్ చికిత్సలో ఉండే రోగులకు భారతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం ఒక్కో బెడ్డుకు ఒక నర్సు ఉండాలి. ప్రభుత్వాసుపత్రుల్లో 10 బెడ్‌లకు ఒక నర్సు ఉన్నారు.
పైగా వెంటిలేటర్ చికిత్సలో ఉన్న రోగికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ రోగికి ఆక్సిజన్ శాతం అందిస్తున్న తీరు, రక్తపోటు, షుగర్ లెవెల్స్ వంటివన్నీ పరిశీలించేందుకు మల్టీ పారామీటర్స్‌తో పర్యవేక్షణ ఉండాలి. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో మల్టీపారామీటర్లే కరువయ్యాయి. అంతేకాదు పేషెంటు స్థితిని బట్టి గంటకు 2 మిల్లీ లీటర్ల నుంచి 30 మిల్లీ లీటర్ల వరకూ వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. ఇంత స్లోగా ఆక్సిజన్ ఇవ్వడమంటే నర్సులకు పెద్ద పరీక్షే.ఇప్పుడు అధునాతన ఇన్‌ఫ్యూజన్ పంప్స్ వచ్చేశాయి. దానిని ఒకసారి అమరిస్తే అదే రోగికి అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఒక ప్రభుత్వాసుపత్రిలో 20 మంది వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటుంటే ఒకటో రెండో ఇన్‌ఫ్యూజన్ పంప్స్ ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రాణాలు హరిస్తున్న సర్కారు ఆసుపత్రులు
ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులు అధికసంఖ్యలో మరణిస్తుండడానికి కారణాలనేకం..అత్యవసర చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు సరిపడినన్ని ఉండడం లేదు.ప్రమాదంలో తీవ్రంగా గాయలాపాలై వచ్చే రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు.
► అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.
► అత్యవసర మందులూ అందుబాటులో ఉండ డం లేదు. రోగులకు సరిపడా పడకలు లేవు రోగులను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్‌లు, ట్రాలీలు లేక చేతుల మీదనే తీసుకెళుతున్న దుస్థితి వైద్య పరికరాల కొనుగోళ్లలో మితిమీరిన అవినీతి కారణంగా...వసతుల కల్పనలోనూ జాప్యం జరుగుతోంది.
► 2015-16 బడ్జెట్‌లో ఔషధాలకు రూ.162 కోట్లు కేటాయించినా రూ.82 కోట్లు ఖర్చు చేయలేదు. ఒకవైపు ఔషధాలు లేక పేద రోగులు అల్లాడుతున్నా, బడ్జెట్ నిధులున్నా ఔషధాలు కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో ఉంచలేదంటే ప్రజారోగ్యం విషయంలో సర్కారు నిర్లక్ష్యం అంచనా వేయొచ్చు.