ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆయన ఆశ్రమ ప్రతినిధి ఉమాపతి దాసాజీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్కి భగవాన్ అస్వస్థతకు గురై తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు.
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం 3 రోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి భగవాన్ వెళ్లిన మాట మాత్రం వాస్తవమేనని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అదే రోజు వరదయ్యపాళెం పరిధిలోని బత్తలవల్లం వద్ద ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆశ్రమంలో దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఈ విషయంలో భక్తులెవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.