గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా వస్తారా?
సాక్షి, చెన్నై: గత కొంత కాలంగా రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. పూర్తిస్థాయిలో గవర్నర్ నియామకం జరగకపోవడం, ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో కాలం వెల్లదీస్తుండంతో తమిళనాడు రాజకీయాలు ప్రతిష్ఠంభనలో పడ్డాయి. ఈ మేరకు వాటన్నింటకి చెక్ పెట్టే విధంగా తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన కల్‌రాజ్ మిశ్రాను తమిళనాడు గవర్నర్‌గా నియమకానికి కసరత్తు పూర్తయినట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.
రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రోశయ్య పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవికి పూర్తి స్థాయిలో గవర్నర్ నియమకం జరగలేదు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్‌రావు ఏడాది కాలంగా తమిళనాడుకు ఇన్‌చార్జి గవర్నర్‌గా అదనపుబాధ్యలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈఏడాదికాలంలో తమిళనాట రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు తప్పలేదు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నర్ ఆచితూచి స్పందిస్తున్నారు. ముంబై టూ చెన్నై పర్యటన సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తమిళనాడుపై విద్యా సాగర్ రావుకు పూర్తి పట్టు ఉన్న దృష్ట్యా, ఆయన్నే పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనకు ఆ భాగ్యం వద్దన్నట్టుగా ఢిల్లీకి ఆయన మొర పెట్టుకున్నట్లు సమాచారం. రాజకీయాలతో విసిగి వేసారిన విద్యా సాగర్ రావు పూర్తి స్థాయి బాధ్యతలు తనకు వద్దని నిరాకరించినట్టు ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత తమిళనాట పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయి గవర్నర్ నియమకంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల బీజేపీ సీనియర్ కల్‌రాజ్ మిశ్రా పేరు తెరపైకి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన పార్టీ ఆదేశాల మేరకు గత వారం పదవికి రాజీనామా చేశారు. ఆయన అనుభవాలు తమిళనాడుకు ఉపయోగ పడుతాయన్న భావనతో బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవికి కేంద్రానికి సిఫారసు చేసినట్టు సమాచారం. దీంతో కల్‌రాజ్ మిశ్రాను తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకు తగ్గ కసరత్తు ముగిసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్న దృష్ట్యా, ఆయన తిరిగి రాగానే, కల్ రాజ్ మిశ్రా నియమకానికి ఆమోదముద్ర పడే అవకాశాలు ఉన్నట్టు కమలనాథుల్లో చర్చ సాగుతోంది.