వాళ్లంతా జైలుశిక్ష అనుభవించాలి: కమల్
తమిళ సినిమా: గూండా చట్టం కింద శిక్షించబడాల్సిన వారెందరో వారి అక్రమాలను, అవినీతిని ప్రజలపై మోపుతున్నారని నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఈయన ఇటీవల రాజకీయ నాయకుల అవినీతిపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రమంత్రుల అవినీతిపై ఆధారాలను సేకరించాల్సిందిగా తన అభిమానులకు పిలుపునిచ్చారు కూడా. ఇటీవల నీట్ వ్యవహారం గురించి కమల్ గొంతెత్తారు. దీంతో రాష్ట్రమంత్రులు కమలహాసన్‌పై ఎదరు దాడికి దిగుతున్న వైనం చూస్తున్నాం. కాగా కమలహాసన్ బుల్లితెరపై బిగ్‌బాస్ పేరుతో రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూలి చిన్న తప్పు చేసినందుకు ఆమెపై కోపం వ్యక్తం చేస్తున్నారని, ఈ చిన్న అమ్మాయిపై అంతగా కోపం పనికిరాదని అన్నారు. అలాగైతే రాజకీయ నాయకులను ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్లంతా గూండా చట్టం క్రింద జైలు శిక్ష అనుభవించాల్సిన వారని, బయట స్వేచ్ఛగా తిరుగుతూ, తమ అవినీతి, అక్రమాలను ప్రజలపై రుద్దుతున్నారని వ్యాఖ్యానించారు. కాబట్టి మీ కోపాన్ని ఇలా వృథా చేయరాదని, దాని అవసరం భవిష్యత్తులో చాలా ఉంటుందని పేర్కొన్నారు. మీరంతా న్యాయం కోసం మాట్లాడే తీరాలని కమల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందువల్ల కోపాన్ని కాస్త తగ్గించుకోవాలని అన్నారు. మీ శక్తి తనకు మండే వస్తువు అవుతుందని పరోక్షంగా తన రాజకీయ పోరాటానికి దోహదపడుతుందని అన్నారు. కాగా ఇప్పటి వరకూ ట్విట్టర్ ద్వారానే రాజకీయాలపై తన భావాలను వెల్లడించిన కమలహాసన్ ఇప్పుడు టీవీ కార్యక్రమం ద్వారా బహిరంగంగానే రాజకీయ వాదులపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.