‘పద్మ భూషణు’డు | Kamal Haasan gets Padma Bhushan | Sakshi
Sakshi News home page

‘పద్మ భూషణు’డు

Published Sun, Jan 26 2014 12:04 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

‘పద్మ భూషణు’డు - Sakshi

‘పద్మ భూషణు’డు

 కలత్తూర్ కన్నమ్మ తమిళ చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పద్మశ్రీ కమల్ హాసన్‌ను ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు వరించింది. కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో కమల్‌హాసన్(4) నటనకు ఆనాడే రాష్ట్రపతి స్వర్ణకమలం లభించింది. 1962లో విడుదలైన ఈ చిత్రం అఖండమైన విజయాన్ని సాధించడమే కాక ఆయన్ను మలయాళ చిత్ర రంగంలోకి కూడా ప్రవేశింప చేసింది. సకలకళా వల్లభుడిగా తమిళ ప్రేక్షకుల చేత మన్ననలు అందుకున్న ఈ నట శిఖరం గురించి ఈ ప్రత్యేక కథనం.  -న్యూస్‌లైన్, అన్నానగర్
 
 కమల్‌హాసన్ 1954, నవంబర్ 7న నేటి రామనాథపురం జిల్లాగా పిలుస్తున్న పరమకుడిలో  జన్మించారు. తన సోదరులైన చంద్రహాసన్, చారుహాసన్ మాదిరిగానే న్యాయవాది కావాలనుకున్న కమల్ అనుకోకుండా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. భారత చలన చిత్ర రంగంలోని అగ్రనటుల్లో ఒకరుగా ఆయన ఎదిగారు. కమల్ సోదరి నళిని నృత్యకారిణి కావడం కమల్‌లోని కళాతృష్ణకు తొలి భీజం వేసింది. కమల్ కుటుంబ వైద్యులు ఒకరు కమల్‌ను, ఆయన తల్లిని ఎవియం ఎం.శరవణన్ దగ్గరకు తీసుకు వెళ్లడంతో ఆయన నటనా జీవితానికి భీజం పడింది. ఎవిఎం నిర్మించబోతున్న కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో నిర్మాత శరవణన్ కమల్‌కు బాల నటుడి పాత్రను ఇచ్చారు. 1959-1963లో కమల్ బాల నటుడిగా ముద్ర వేసుకున్నారు. 1970-1975లో మన్నవన్, కె.బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రం, అవల్ ఒరు తొడర్ కథై వంటి తమిళ చిత్రాలు కమల్‌కు పరిణితి గల నటుడిగా పేరు తెచ్చాయి. 
 
 1974లో కమల్ కన్యాకుమారి అనే మలయాళ చిత్రంలో నటించారు. దీనికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. కె.బాలచందర్ నేతృత్వంలో కమల్ నటించిన అపూర్వ రాగంగళ్‌కి సైతం జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం కోసం కమల్ మృదంగం నేర్చుకున్నారు కూడా. అపూర్వ రాగంగళ్‌లోని కమల్ నటనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. తెలుగు, తమిళ, మల యాళ, కన్నడ, హిందీ భాషల్లో కమల్ నటించిన చిత్రాల సంఖ్య 225కి పై మాటే. కమల్ తన నటనా జీవితంలో 17 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. రాజ్‌కమల్ ఇంటర్ నేషనల్ అనే బ్యానర్‌తో సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తెలుగులో కమల్ నటించిన మరో చరిత్ర, ఇది కథ కాదు, అంతులేని కథ, సాగర సంగమం, స్వాతిముత్యం, వసంతకోకిల,
 
 విశ్వరూపం, ఈనాడు, ఇంద్రుడు - చంద్రుడు, అపూర్వ సహోదరులు, వయసు పిలిచింది, అమరప్రేమ, అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, అందగాడు, మన్మథలీల, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, శుభ సంకల్పం, పుష్పక విమానం, అమావాస్య చంద్రుడు వంటి హిట్ చిత్రాల్లో నటించారు.హిందీలో సాగర్, ఏక్ దూజే కేలియే, ఆయేనా, సనం తేరి కసమ్, ఏతో కమాల్ హోగయా, జరాసి జిందగీ, సద్మా (ఇది తెలుగులో వసంత కోకిలగా, తమిళంలో మూండ్రాంపిరైగా వచ్చింది), ఏదేశ్, ఏకనయిపహిలే, యాద్‌గర్, రాజాలి ఎన్ కరిష్మా, గిరఫతార్, దేఖాఫ్యార్ తుహ్హారా, చాచి 420 హేరామ్, ముంబై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల్లో నటించి ఔరా అనిపించారు. 
 
 నిర్మాతగా కమల్ రాజా పార్వై (తెలుగులో అమావాస్య చంద్రుడు) విక్రం, సత్య, పుష్పక విమానం, అపూర్వ సహోదరగళ్, మైఖేల్ మదన్ కామరాజు, దేవర్ మగన్, సతీ లీలావతి, హేరాం, చాచి 420, నలదమయంతి, విరుమాండి, ముంబయి ఎక్స్‌ప్రెస్, ఈనాడు, విశ్వరూపం పేరిట చిత్రాలను నిర్మించారు. వివిధ భాషలకు చెందిన 50 చిత్రాల్లో కమల్ గాయకుడిగా కూడా తన గళాన్ని వినిపించారు. హేరాం, విరుమాండి, ఉన్నైప్పోల్ ఒరువన్, మన్మథన్ అంబు, విశ్వరూపం చిత్రాల్లో పాటలు కూడా రాశారు. విశ్వరూపం, విరుమాండి, హేరాం, చాచి 420 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతుడు చిత్రానికి కమల్ సహాయక నృత్య దర్శకుడిగా పని చేశారు. సావళి సమళి, నూట్రుక్కునూరు, వెళివిళా,
 
 కన్నా నళమా, నాన్ అవన్ ఇళ్లై, అవర్‌గళ్, ఆయేనా (హిందీ) విరాసత్ (హిందీ) అన్భే శివం వంటి చిత్రాలకు కమల్ సహాయక దర్శకుడిగా, కథా రచయితగా, సహాయక నృత్య దర్శకుడిగా కూడా పని చేశారు. సినిమాలోని ప్రతి విభాగంలోనూ పద్మశ్రీ కమల్ తనదైన ప్రతిభను చాటారు. అందుకే  ఆయన్ను తమిళ రసకంలో సకల కళా వల్లభన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.సంఘ సేవలోనూ మేటి: చెన్నైలోని పోరూరు రామచంద్రా యూనివర్శిటీ, తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ విభాగం వంటి సంస్థలకు కమల్ రూ.50 లక్షలను సహాయంగా అందచేసి సంఘసేవకుడిగా పేరు పొందారు. కమలహాసన్ సంక్షేమ సమాఖ్య అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నగరంలోని సంఘ సేవకులకు ప్రత్యేక నగదు బహుమతులను,అవార్డులను కూడా అందచేస్తున్నారు. కమలహాసన్ చేస్తున్న సంఘసేవకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన అబ్రహాం కోవూరు అవార్డు లభించింది. 
 
 అవార్డుల్లో  కూడా రికార్డులే: కమల్ తన నటనా జీవితంలో నేటి వరకు 66 సార్లు అవార్డులకు ప్రతిపాదనకు నోచుకున్న ఏకైక భారతీయ నటుడు. ఇందులో ఆయన 56 సార్లు అవార్డులను గెలుచుకోవడం మరో అరుదైన రికార్డు. వాణిగణపతి, సారికతో వివాహబంధంలో ఇమడలేని కమల్ ప్రస్తుతం ప్రముఖ తెలుగు నటి గౌతమితో కలసి సహజీవనం చేస్తున్నారు. కమల్‌కు శృతిహాసన్, అక్షర హాసన్ కుమార్తెలున్నారు. వీరిలో శృతిహాసన్ నటి, సంగీత దర్శకులు కూడా. స్థానికంగా ప్రాంతీయ భాషల్లోనూ కమల్ పొందిన అవార్డులకు  - సన్మానాలకు లెక్కలేదు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిని నేడు పద్మభూషణ్ వరించడంలో ఆశ్చర్యమేముంది? 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement