కమల్‌.. దారెటు? | Kamal hasan Long talks with leaders of fan communities | Sakshi
Sakshi News home page

కమల్‌.. దారెటు?

Published Mon, Mar 6 2017 3:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

కమల్‌.. దారెటు?

కమల్‌.. దారెటు?

► అభిమాన సంఘాల నేతలతో  సుదీర్ఘ చర్చలు
► రాజకీయాల దిశగా అడుగులు!
►  అదేమీ లేదన్న అభిమానులు


సాక్షి ప్రతినిధి, చెన్నై: సకలకళావల్లవన్  కమల్‌హాసన్  ఇక రాజకీయాల్లో తన కళను ప్రదర్శించనున్నారా ? రాజకీయ పార్టీని స్థాపించడమో, మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడమో వంటి నిర్ణయం ద్వారా ప్రజాజీవితంలో కాలునిడనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ ప్రశ్నలపై జవా బులకు ఊతమిచ్చే విధంగా ఆది వారం తన అభిమాన సంఘాల నేతలతో కమల్‌హాసన్ సమావేశమై కలకలం సృష్టించారు. బహుభాషా నటుడు కమల్‌హాసన్  ఇటీవల తరచూ రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. 

జయలలిత మరణించిన తరువాత నుంచే కమల్‌ వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పుకనబడుతోంది. రాష్ట్రంలో ఉద్ధృతంగా సాగి దేశ ప్రజలను తనవైపునకు తిప్పుకున్న జల్లికట్టు ఉద్యమానికి మద్దతిస్తూ గట్టిగా స్పందించారు. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ తరువాత పన్నీర్‌సెల్వం పదవీచ్యుతుడు కావడం, సీఎం అయ్యేందుకు శశికళ పావులు కదపడం, చిన్నమ్మ జైలు కెళ్లడం, ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడడం వంటి రాజకీయ పరిణామాల సమయాల్లో సైతం కమల్‌ తన వాదనను వినిపించారు. విశ్వరూపం సినిమా విడుదలను అడ్డుకుంటూ జరిగిన రాజకీయంపై విసుగుచెందిన కమల్‌హాసన్  దేశాన్ని విడిచి వెళ్లిపోతానని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు.

తమిళనాడులో నివసించేందుకే ఇష్టపడని కమల్‌ వైఖరిలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలపై, ప్రజాసమస్యలపై గతంలో ఎన్నడూ అంతగా స్పందించని కమల్‌హాసన్  అకస్మాత్తుగా తన ధోరణిని మార్చుకోవడం వెనుక బలమైన అంతరార్థం దాగి ఉందని అందరూ విశ్వసిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తనకు రాజకీయాలు తెలియవు, అందులోకి ప్రవేశించాలనే ఆలోచన కూడా లేదు, ప్రజల మేలుకోరుతూ కొన్ని విషయాలపై మాట్లాడుతున్నానని బదులిచ్చారు. కమల్‌ వ్యవహారశైలికి అనుగుణంగా విమర్శలు చేసిన నేరంపై ఆయన అభిమాని ఒకరు ఇటీవల కటకటాల పాలయ్యాడు. అభిమాని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన కమల్‌హాసన్  ప్రజలు తనవైపు ఉన్నారని వ్యాఖ్యానించారు.

అభిమాన సంఘాలతో చర్చలు: ఈ నేపథ్యంలో కమల్‌హాసన్  చెన్నై అళ్వార్‌పేట ఎల్డామ్స్‌ రోడ్డులోని తన కార్యాలయంలో అభిమాన సంఘాల నేతలతో ఆదివారం సమావేశమై చర్చలు జరిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన సుదీర్ఘ చర్చల్లో కమల్‌హాసన్  సంక్షేమ సంఘం నిర్వాహకులు, సంఘానికి చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమల్‌హాసన్ కు సంఘం నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సంఘం కార్యకలాపాలను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు, రాజకీయాలను ప్రస్తావించలేదని ఒక అభిమాని తెలిపాడు. మీడియా ప్రతినిధులను కలుసుకునే ఆలోచన కూడా కమల్‌కు లేదని ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా కమల్‌ కార్యాలయం ముందు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement