చికాకు పెడుతూనే ఉంటా: కమల్ హాసన్
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డానని విలక్షణ నటుడు కమల్ హాసన్ అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. 2013లో 'విశ్వరూపం' సినిమా విడుదలకు జయ ప్రభుత్వం ఎలా ఆటంకాలు కల్పించిందో గుర్తుచేసుకున్నారు. తన సర్వసాన్ని పెట్టి 'విశ్వరూపం' సినిమా నిర్మించానని, అయితే, ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం సినిమాను నిషేధించిందని పేర్కొన్నారు. సినిమా విడుదలపై నిషేధం ఎత్తివేయకుంటే తమిళనాడు వీడి వెళ్లిపోతానని అప్పట్లో కమల్ భావోద్వేగంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం బలవంతపు పెళ్లిలాంటిదేనని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రుద్దారని ఆయన విమర్శించారు. తమిళనాడులో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారిని తాను చికాకు పెడుతూనే ఉంటానని, రాజకీయాలపై గళమెత్తడం ద్వారా ప్రభుత్వంలో ఎవరు ఉన్నా.. వారిని ప్రశ్నిస్తానని ఆయన పేర్కొన్నారు.