కమలహాసన్
మంచి పేరున్నోళ్లకే పార్టీ టికెట్ ఇవ్వడానికి మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ నిర్ణయించుకున్నారు. ఏడాది క్రితం అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి, వెనువెంటనే పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి వచ్చిన నటుడు కమలహాసన్. అవినీతిని, నిరుద్యోగాన్ని రూపు మాపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లిన కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ ఆ దిశగా పునాదులను గట్టిగానే వేసుకుంది. ఇతర పార్టీ నాయకులకు భిన్నంగా తన ప్రత్యేకతను చాటు కుంటున్న కమలహాసన్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. అదీ ఒంటరి పోరుకు దిగుతూ 40 స్థానాల్లో అభ్యర్థులను దించడానికి రెడీ అయ్యారు. గత నెల 28వ తేదీన అభ్యర్థులకు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమలహాసన్ ఈ నెల 6, 7 తేదీల్లో వారి నుంచి దరఖాస్తులను పొందారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 1137 దరఖాస్తులు వచ్చాయి. కాగా స్థానిక ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వయంగా అందుకున్నారు.
ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. సోమవారం నుంచి అభ్యర్థులతో కమలహాసన్ ముఖాముఖి చర్చ జరుపుతున్నారు. ఆయనతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు డా.మహేంద్రన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పార్టీ కార్యదర్శి అరుణాచలం, కార్టూనిస్ట్ మదన్, నటి కోవైసరళ, మరికొందరు సామాజిక వేత్తలు ఇందులో పాల్గొన్నారు. తొలిరోజున తిరుచ్చి, తిరువణ్ణామలై, విళుపురం, ఆరణి, చిదంబరం, పుదుచ్చేరి, శ్రీపెరంబుత్తూర్, తిరువళ్లూర్, అరక్కోణం, ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధ్య చెన్నై మొదలగు 12 స్థానాలకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులను ఆహ్వానించారు. ఈ నియోజక వర్గాల నుంచి సుమారు 100 మంది ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ ఈ సమావేశం జరిగింది. ఈ ముఖాముఖి చర్చలో ఏడాదిగా సభ్యులుగా ఉన్న వారు పార్టీ కోసం ఏమేమి కార్యక్రమాలు చేశారు. సభ్యులు కాని వారు ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలేమిటీ? ప్రజల మధ్య వారికి ఉన్న పేరు, ప్రజల్లో మక్కళ్ నీది మయ్యం పార్టీకి ఎలాంటి ఆదరణ ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహం అవలంభిచనున్నారు? లాంటి అంశాల గురించి ప్రశ్నలు అడిగారు. ముఖాముఖి చర్చలో పాల్గొన్న వారందరికీ కమలహాసన్ రాజకీయ చట్టం గురించిన పుస్తకాన్ని అందించారు. అయితే ఇక్కడ ఇతర పార్టీల వారి మాదిరిగా ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తారు? అని కమలహాసన్ ప్రశ్నించకపోవడం విశేషం. నియోజకవర్గాల వారిగా ఈ నెల 15వ తేదీ వరకూ ఈ ముఖాముఖి చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సత్ప్రవర్తులకే పార్టీ టికెట్
ఎలాంటి నేర చరిత్ర లేనివారికి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించిన వారికీ, ఆయా ప్రాంతాల్లో మంచి పేరు ఉన్నవారికే, అదే విధంగా విద్యావంతులు, వయస్సు వంటివాటిని పరిగణలోకి తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పార్టీ నిర్వాహకులు తెలిపారు. దీని గురించి సుదీర్ఘంగా చర్చించి నామినేషన్ దాఖలు చేయాల్సిన తేదీకి ఒక్క రోజు ముందు ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారట. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడటంలో కమలహాసన్ తాను నటిస్తున్న ఇండియన్–2 చిత్ర షూటింగ్‌ను వాయిదా వేసుకుని పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారట.
Comments
Please login to add a commentAdd a comment