సాక్షి, చెన్నై: ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో పార్టీని స్థాపించాను, వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే పార్టీని ఎత్తేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్ కార్యకర్తలను హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో చెన్నైలోని ఒక ప్రయివేటు హోటల్‌లో పార్టీ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతున్నారు. ఇటీవల పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలతో ముఖ్యమైన అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ వివరాలను పార్టీ నేత ఒకరు వివరించారు. సుమారు 3 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఒక్కో ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కార్యక్రమాలను విశ్లేషించుకున్నాం. పార్టీ ఆశయాలు, లక్ష్యాలను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించాం. మొత్తం 37 అంశాలపై కమల్ చర్చించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. సమావేశం ప్రారంభంలోనే నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిచేయవచ్చని కమల్ కోరారు. (విశ్వాస పరీక్షలో గహ్లోత్ గెలుపు)
ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై పార్టీ విధానాలను కమల్ వివరించారు. కేంద్రప్రభుత్వ సరికొత్త విద్యావిధానం, రిజర్వేషన్, టాస్మాక్, విద్యాబోధనలో ద్విభాషా విధానం, రాష్ట్ర అవసరాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల అంశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అందుకు కారణాలను నిర్వాహకులకు ఆయన వివరించారు. అంతేగాక ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఏర్పాట్లు, కూటమి అంశాలపై కూడా నిర్వాహకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో తమిళనాడు ఆర్థికపురోగతి సాధించేలా చేయడమే పార్టీ లక్ష్యమని కమల్ అన్నారు. హిందూ వ్యతిరేక పార్టీ అనే దు్రష్పచారాన్ని ఎలా అధిగమించాలని ప్రశ్నించారు. యువశక్తిని కూడగట్టడం ఎలా అని సలహాలు తీసుకున్నారు. ఇలా సాగిన ఈ సమావేశంలో మొత్తం 350 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. (రాజుకుంటున్న ఎన్నికల వేడి)
నేతలకు హెచ్చరిక:
నిర్వాహకుల సందేహాలను తీర్చిన కమల్‌హాసన్ పలు ఆదేశాలతోపాటు హెచ్చరికలను సైతం జారీచేశారు. పార్టీ విధానాలు మీ ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు పోవాలంటే వాటిపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. నేను చెన్నైలో ఉండే నిర్వాహకుల పనితీరుపై నిఘా పెట్టి ఉంచాను. మీ కింద పనిచేసేవారికి విలువ ఇవ్వండి. పార్టీ నిర్వహణలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదు. నా భవిష్యత్తును పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేశాను. ఈ విషయాన్ని పార్టీని ప్రారంభించినపుడే స్పష్టం చేశాను. అయితే నా మాటలను కొందరు హేళన చేయవచ్చు. అయినా ఇది సత్యం.
నా రాజకీయ పయనంలో నిర్వాహకుల వల్ల ఎదైనా ఆటకం కలిగితే తీవ్ర చర్యలు తీసుకుంటాను. ఆశయాలు, లక్ష్యాలను కాదని తప్పుడు మార్గంలో పయనిస్తే పార్టీ ఎత్తేసి మరో మార్గంలో ప్రజాసేవ వైపు వెళ్లేందుకు కూడా వెనుకాడను. నిజాయితీతో కూడిన నా భావిజీవితం కోసం మీలోని ప్రతి ఒక్కరిపై ఎంతో ఆశలు పెట్టుకున్నాను. ఈ పార్టీ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. మా పార్టీ అధినేత మాతో ఇలా మనసు విప్పి మాట్లాడడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటాం, విజయం సాధిస్తామని ఆ నిర్వాహకుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment