సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ చుట్టూ తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించిన నాటినుంచి వీరి తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. అటు రజనీ, ఇటు కమల్‌పై జాతీయ, ప్రాంతీయ మీడియాలు ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. ప్రస్తుతం పార్టీ ఏర్పాటు, క్యాడర్ నిర్మాణం, విధివిధానాల ఖరారు మొదలైన సన్నాహక దశల్లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
రజనీకాంత్, కమల్ హాసన్ సినీరంగంలో మంచి స్నేహితులు.. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన మొదట్లో కలిసి ప్రయాణం చేశారు. కలిసి సినిమాల్లో నటించారు. సూపర్‌స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోనూ వీరిద్దరి మధ్య ఆ స్నేహబంధం వెల్లివిరిస్తుందా? ఈ ఇద్దరూ కలిసి పోటీ చేసే అవకాశముందా? రజనీ-కమల్ మధ్య పొత్తు కుదురుతుందా? అంటే ఇప్పటికిప్పుడు ఇథమిత్థంగా చెప్పలేని పరిస్థితి.
అయితే, రజనీతో పొత్తు పెట్టుకోవడం కుదరదని కమల్ తాజాగా సంకేతాలు ఇస్తుండటం గమనార్హం. ‘రజనీకాంత్ రాజకీయాల్లో కాషాయ రంగు ఛాయలు కనిపిస్తున్నాయి. అది మారకపోతే.. అతనితో నేను పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. మేం మంచి స్నేహితులమే కానీ రాజకీయాలు భిన్నమైనవి’ అని కమల్ ఆదివారం తేల్చేశారు. రజనీ బీజేపీ అనుకూల విధానాలు వీడకపోతే.. ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని కమల్ స్పష్టం చేశారు. కమల్ ఈ మేరకు చేసిన సంచలన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment