జయ టార్గెట్ చేశారు
♦ విశ్వరూపం విడుదలలో రాజకీయం
♦ కామరాజనాడార్, ఎంజీఆర్, శివాజీ కూడా విద్యావేత్తలు కాదు
♦ పౌరుడిగా విమర్శించే హక్కుంది
♦ రాజకీయ పార్టీకోసం ఒత్తిడి చేయవద్దు
♦ ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, చెన్నై : జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను టార్గెట్ చేశారని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రశ్నకు బదులేదీ’ కార్యక్రమం కింద ‘తంది’ తమిళచానల్‌కు కమల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రసారమైంది. ఈ సందర్భంగా ఆయన పలు ఆంశాలను ఆయన ముక్కుసూటిగా ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే..
రాజకీయ విమర్శలు కొత్తగా చేస్తున్నవి కాదు, ముఖ్యమంత్రి జయలలిత నా సినీజీవితంపై ప్రత్యేకంగా గురిపెట్టారు. విశ్వరూపం సినిమాలో ఒక సామాజికవర్గాన్ని కించపరచలేదు, ఈ విషయాన్ని వారే అంగీకరించారు. సినిమా విడుదల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆనాటి పాలకుల రాజకీయమే. సినిమాను రాజకీయం చేసిన ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిపోయిన నేను రాష్ట్రం లేదా దేశం విడిచి వెళతానని అన్నాను. అంటే తెల్లదొరలతో చేరిపోతానని కాదు. ఇలాంటి వేధింపులు లేని మరో రాష్ట్రంలో స్థిరపడతానని అర్థం. నేను తీసుకున్న నిర్ణయానికి సిగ్గుపడాల్సిన నేతలు నేడు విమర్శలు చేస్తున్నారు.
మనస్సులో ఏదో పెట్టుకుని నేను విమర్శలు చేయడం లేదు, ప్రజలతో పంచుకుంటున్నాను. దేశం మంచి మార్గంలో పయనించాలని ఒక పౌరుడిగా కోరుకోవడం, విమర్శించిడం నా హక్కు. దీన్ని ఎవరు తప్పు పట్టినా పట్టించుకోను. రజనీకాంత్ పార్టీ పెట్టినా తప్పుంటే విమర్శలకు వెనుకాడను. తమిళనాడు ప్రజలు నాయకత్వ లక్షణాలను ఉన్నవారిని కాకుండా నిపుణులను మాత్రమే వెదుకుతున్నారు. నాకు కనీసం ప్రాథమిక విద్య కూడా లేదని కొందరు హేళన చేస్తున్నారు. కామరా>జనాడార్ చదుకోకున్నా ప్రత్యేకమైన సమర్థత కలిగిన వారు, ప్రజల మన్నలను పొందారు. శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ కూడా ఉన్నత విద్యలు అభ్యసించలేదు.
అయితే వారు ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా నిరూపించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు నేడు అటువంటి నేతలు లేరు. నిర్మాతగా, నటుడిగా సరైన మార్గంలో వెళుతున్నా, క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. నా చిన్నతనం నుంచే ఇంట్లో అందరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మనఃపూర్వకంగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. ఈ చర్చల్లో ఆస్తికత్వం, నాస్తికత్వం అంశాలు కూడా మా చర్చల్లో చోటు చేసుకుంటాయి. మనసుకు తోచిన అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఎప్పుడూ నేను జంకలేదు.