ఇంద్రకీలాద్రిపై నకిలీ డ్యూటీ కార్డుల బాగోతం...
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగే సూత్రధారి
అయినా చర్యలకు మీనమేషాలు
ఇంద్రకీలాద్రి: దసరా ఉత్సవాలలో దుర్గగుడిలో రట్టయిన నకిలీ డ్యూటీ కార్డుల కుంభకోణంలో బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులు నీళ్లునములుతున్నట్లు విమర్శలున్నాయి. ఈ బాగోతంతో ఆలయ పాలకవర్గం పరువుపోయినంత పనైంది. పరిపాలనా విభాగంలో అవుట్‌సోర్సింగ్‌లో పని చేసే ఒక ఉద్యోగే ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు సమాచారం. అంగ, అర్ధ బలాలు దండిగా ఉన్న అతడు సుదీర్ఘ సెలవుపై ఉంటూ కొద్ది రోజుల కిందటే డ్యూటీకి తిరిగి వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
ఈ డ్యూటీ కార్డులను ఈ వ్యక్తి తమ అనుకూల వర్గానికి ఇష్టానుసారంగా జారీ చేసినట్లు ఆలయ సిబ్బంది బహిరంగంగానే చెబుతుండగా, అధికారుల విచారణలోనూ ఇదే వెల్లడైంది. అధికారులు డ్యూటీ కార్డులు జారీ చేసింది కొందరికే అయితే, ఆ కార్డులను కలర్ జిరాక్స్‌లు, పేర్లు, ఫోటోల మార్పిడితో ఇబ్బడిముబ్బడిగా నకిలీ కార్డులను పుట్టించారు. ఇలా పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి రాజమార్గంలో చేరుకున్నారు. ఈ వ్యవహారం అనూహ్యంగా బయటకు రావడంతో రెండు రోజులలో సుమారు ఆరు వందలకు పైగా డ్యూటీ కార్డులను ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నచ్చినవారికి పంచిపెట్టారు
వన్‌టౌన్‌లోని పలు దుకాణాల యజమానులకు, గుమస్తాలతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించిన వారికి ఈ నకిలీ కార్డులు పంచినట్లు తెలుస్తుంది. వాస్తవానికి డ్యూటీ కార్డులు జారీ చేసే సమయంలో కార్డులు ఎవరికి కార్డులు జారీ చేస్తున్నారని అంతా ఓ ప్రణాళిక ప్రకారం కొంత మంది సిబ్బందిని నియమించి మంజూరు చేశారు. ఉద్యోగి వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే కార్డులను మంజూరు చేశారు. డ్యూటీ కార్డుల దుర్వినియోగానికి కారణమైన వ్యక్తిని ఆలయ అధికారులు గుర్తించినా అతనిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవస్థానానికి లక్షలాది రూపాయలు నష్టంతో పాటు పరువుకు భంగం కలిగినా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
డూప్లి‘కేటుగాడి’ పై అంత ప్రేమా?
Published Sat, Oct 8 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement
Advertisement