‘కంచి’కి చేరిన కథ
Published Thu, Nov 28 2013 1:27 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
కంచి స్వాములపై మోపిన హత్య అభియోగం కథ కంచికి చేరింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో కంచిలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. స్వాముల భక్తులు, అభిమానులు, స్థానికులు బాణ సంచా కాల్చి పండుగ చేసుకున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిత్యం మునిగితేలే కంచి మఠం పీఠాధిపతులు హత్య కేసులో ఇరుక్కోడం దేశంలోనే కలకలం రేపింది. కంచి మఠం నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ కంచి వరదరాజ పెరుమాళ్ కోవిల్ మేనేజర్ శంకరరామన్ ప్రభుత్వానికి ఉత్తరాలపై ఉత్తరాలు రాస్తున్న తరుణంలోనే 2004 సెప్టెంబరు 3వ తేదీన హత్యకు గురయ్యారు. శంకరామన్ తన ఉత్తరాల్లో కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతిని నిందించడంతో హత్యకు వారే పురమాయించి ఉంటారని పోలీసులు భావించారు. ఈ మేరకు వీరిద్దరు సహా 25 మందిని నిందితులుగా చేర్చారు. ఆశ్చర్యకరంగా ఆరోపించిన వారే కోర్టు విచారణలో సహకరించక పోవడం తీర్పును ప్రభావితం చేసింది. హతుని భార్య, కుమారుడు ఆనందశర్మ, కుమార్తె ఉమా మైత్రేయి సైతం హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించలేక పోతున్నామని కోర్టుకు విన్నవించడంతో అందరూ నిర్దోషులుగా బయటపడ్డారు.
కంచి స్వాముల కేసులో తీర్పు వెలువడుతుందని తెలియడంతో పుదుచ్చేరిలోని కోర్టు ప్రాంగణం బుధవారం కిటకిటలాడింది. ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. మరో వైపు జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు. తీర్పు వెలువడిన అనంతరం విజయేంద్ర స్వామి అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఎలక్ట్రానిక్ మీడియా అనేక ప్రయత్నాలు చేసింది. స్వామి మౌనవ్రతంలో ఉన్నారంటూ శిష్యులు వారించడంతో మీడియా నిరాశగా వెనుతిరగక తప్పలేదు. కేసు విచారణలో నిందితుడు హత్యకు గురికావడం, విచారణను నిలుపుదల చేయాలని శంకరరామన్ కుమారుడు ఆనందశర్మ పిటిషన్, కేసు పరిధి, న్యాయవాది, న్యాయమూర్తి మారడం వంటి అనేక అడ్డంకులు, ఆటుపోట్ల నడుమ కేసు విచారణ 9 ఏళ్లు సాగింది.
ఆనందోత్సాహాలు
కంచి స్వాములు నిర్దోషులంటూ తీర్పు వెలువడగానే కంచిలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు, భక్తులు, అభిమానులు బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు నుంచి వెలుపలకు వచ్చిన జయేంద్ర సరస్వతి ప్రత్యేక కారులో తిరుచందూరుకు, విజయేంద్ర సరస్వతి కంచి మఠానికి వెళ్లిపోయారు. జయేంద్ర సరస్వతి గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకుని శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి కంచికి చేరుకుంటారు.
Advertisement
Advertisement