రేసులో కనిమొళి
సాక్షి, చెన్నై : దరఖాస్తుల పర్వంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి స్టాలిన్‌ల కోసమే కాదు... రేసులో కనిమొళి సైతం దిగినట్టున్నారు. ఆమె తమ నియోజకవర్గంలో అంటే.. తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు చేస్తున్న మద్దతుదారులు పెరుగుతున్నారు. అయితే కని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి. తన గారాల పట్టిని రాజ్యసభకు పంపించి ఉన్నారు. ఎన్నికల సమయాల్లో తాను సైతం అంటూ ప్రచార బరిలో దిగుతూ వచ్చిన కనిమొళి ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో మాత్రం దిగలేదు.
ఈ సారి పార్టీ పరంగా ఆమెకు పెద్దపీట వేసి ఉన్నారు. మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ విభాగం బలోపేతానికి శ్రమిస్తూ వస్తున్న కనిమొళిని తాజాగా ఎన్నికల కదనరంగంలోకి దించేందుకు మద్దతుదారులు సిద్ధం అయ్యారు. డీఎంకే దరఖాస్తుల పర్వంలో కరుణానిధి, స్టాలిన్‌లు తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని పోటీ పడి మరీ దరఖాస్తులు సమర్పిస్తూ వస్తున్న డీఎంకే నాయకులు సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తున్నది.
తాజాగా ఆ రేసులో తానూ అన్నట్టుగా కనిమొళి రంగంలోకి దిగినట్టుంది. కరుణానిధి, స్టాలిన్‌లతో పాటుగా కనిమొళి కోసం దరఖాస్తులు దాఖలు అవుతోండడం ఇందుకు నిదర్శనం. కనిమొళి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తూ, ఆమె తమ నియోజకవర్గం అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని వేలాది రూపాయలు పెట్టి దరఖాస్తుల్ని కొని మద్దతు పలికే పనిలో కొందరు డీఎంకే వర్గాలు పడ్డాయి. గురువారం కనిమొళి కోసం చెన్నై రాయపురం నియోజకవర్గం, మదురవాయిల్ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు దాఖలు కావడం విశేషం.
ఇక డీఎండీకే వంతు: అన్నాడీఎంకే, డీఎంకే దరఖాస్తుల పర్వం ముగింపు దశలో ఉండగా, పీఎంకే శ్రీకారం చుట్టి ఉన్నది. ఇక డీఎండీకే వంతు వచ్చినట్టుంది. డీఎండీకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల దాఖలుకు తేదీని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు.
ఫిబ్రవరి ఐదో తేదీ ఉదయం పది గంటల నుంచి దరఖాస్తుల్ని కోయంబేడు కార్యాలయంలో విక్రయించనున్నారు. ఫిబ్రవరి 14 సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేసిన దరఖాస్తుల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక, జనరల్ స్థానానికి దరఖాస్తు రుసుంగా రూ.10 వేలు, రిజర్వుడు స్థానానికి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పుదుచ్చేరిలో పోటీకి సిద్ధంగా ఉండే ఆశావహులు జనరల్‌కు రూ.5 వేలు, రిజర్వుడుకు రూ.2500 చెల్లించి దరఖాస్తు స్వీకరించాల్సి ఉంటుందని విజయకాంత్ ప్రకటించారు.