ముహూర్తం కలిసి రాలేదు ! | Karnataka anti-superstitious bill | Sakshi
Sakshi News home page

ముహూర్తం కలిసి రాలేదు !

Published Sat, Jul 9 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

Karnataka anti-superstitious bill

 మూఢాఛారాల నిషేధ బిల్లుపై మంత్రి వర్గంలో కుదరని ఏకాభిప్రాయం
 ముసాయిదా బిల్లుపై వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం

 
బెంగళూరు: మూఢాచారాల నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుపై మంత్రి వర్గంలో ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రంలో నరబలి, చేతబడులు వంటి వాటి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మూఢాచారాల నిషేధ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశల్లో చట్టసభల్లో ప్రవేశపెట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై శుక్రవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో చర్చించగా, మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంత్రి వర్గంలోనే బిల్లుపై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూఢాచారాల నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్న నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇక శుక్రవారం జరిగిన మంత్రి మండలి భేటీలో మూఢాచారాల నిషేధానికి రూపొందించిన ముసాయిదా బిల్లుపై చర్చించారు. ఇప్పటికే ఈ బిల్లుపై పలువురు మఠాధిపతులు, కొన్ని సంఘాలు, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుపై కొంతమంది మంత్రులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక ఈ బిల్లులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరించాలని సైతం కొంత మంది మంత్రులు సీఎం సిద్ధరామయ్యను కోరారు. దీంతో ఇప్పటికి ఈ బిల్లును ప్రవేశపెట్టే విషయాన్ని పక్కనపెట్టాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి మండలి పూర్తి సమ్మతితోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించిన సీఎం సిద్ధరామయ్య ఈ ముసాయిదా బిల్లులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరించాల్సిందిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ...‘మూఢాచారాల నిషేధ బిల్లుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించాం, మంత్రి వర్గ సభ్యులెవరూ ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు, కేవలం ఈ బిల్లును మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు, అందువల్ల మూఢాచారాల నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని కొంతకాలం వాయిదా వేస్తున్నాము’ అని తెలిపారు. ఇక ఇదే విషయంపై మంత్రి ఆంజనేయ మాట్లాడుతూ.....‘మూఢాచారాల నిషేధ బిల్లుకు సంబంధించిన సాదక, బాధకాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కొంతమంది మంత్రులు అభిప్రాయపడ్డారు. రానున్న మంత్రి మండలి సమావేశంలో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement