మారకపోతే.. మీ ఖర్మ
మంత్రులపై సీఎం అసహనం
* మీ పని తీరుపై అధిష్టానానికి నివేదిక ఇచ్చా
* ఇకనైనా పని తీరు మార్చుకోండి
*లేకుంటే.. జరగబోయే పరిణామాలకు నేను బాధ్యుడ్ని కాను
* నా మాటలను పెడచెవిన పెడుతున్నారు
* ఎమ్మెల్యేల ఫిర్యాదులనూ పట్టించుకోవడం లేదు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు చేస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు స్పందించారు. బెల్గాంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశంలో ఆయన మంత్రుల ఎదుటే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పని తీరును మార్చుకోక పోతే మున్ముందు చోటు చేసుకునే పరిణామాలకు తనను బాధ్యుని చేయవద్దని కోరారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మీ పని తీరుపై నివేదిక సమర్పించానన్నారు. మారండి, మారండంటూ ఎంతగా మొత్తుకున్నా వినిపించుకోడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
బెంగళూరులో ఉన్నప్పుడు వారంలో కనీసం మూడు రోజులు విధాన సౌధకు వచ్చి, అధికారులతో చర్చించాలన్న తన సూచనలను సైతం పెడచెవిన పెట్టారని నిష్టూరమాడారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తల సమస్యలపై స్పందించడం లేదు, కేపీసీసీ కార్యాలయానికీ వెళ్లడం లేదు అంటూ ఆయన మంత్రుల వైఫల్యాల చిట్టాను విప్పారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినప్పుడు మంత్రులు స్పందించడం లేదని, దీనిపై ఫిర్యాదులు వచ్చినా తీరు మారడం లేదని నిష్టూరమాడారు.
ఇదే వైఖరి కొనసాగితే మున్ముందు ఏమవుతుందో తాను చెప్పలేనని హెచ్చరించారు. అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరును తప్పుబట్టారు. తమను విశ్వాసంలోకి తీసుకుని నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులపై స్పందించాలని కోరారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని సూచించారు. కనీసం రెండు నెలలకోసారి సీఎల్‌పీ సమావేశాలను నిర్వహించి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.