మాఫియాను అణచండి
పోలీసు అధికారులకు సీఎం క్లాస్
సమాజ ద్రోహులతో జత కట్టొద్దు
‘రియల్’ మాఫియాతో సంబంధాలొద్దు
పేదలకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం
జూదం, వ్యభిచారాన్ని అదుపు చేయండి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రియల్ ఎస్టేట్ మాఫియాతో సంబంధాలు వద్దు. అదనపు డీజీపీలు జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను స్వీకరించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించలేకపోతే ఎస్‌పీ, ఐజీలు బాధ్యతలు వహించాలి.... మంగళవారం ఇక్కడ డీజీపీ కార్యాలయంలో జరిగిన వార్షిక పోలీసు అధికారుల సమావేశంలో సీఎం చేసిన దిశా నిర్దేశం. పదవి చేపట్టిన తర్వాత తొలి సారి ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. బాపూజీ కోరుకున్న విధంగా మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా సంచరించే వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. సమాజ ద్రోహులతో జట్టు కట్టవద్దని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు వద్దని హితవు పలికారు. ధనవంతులు పోలీసులతో కలసి పేదలను హింసించడం మంచిది పద్ధతి కాదన్నారు.
పేదలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మట్కా, జూ దం, వేశ్యా వాటికలు, అక్రమ క్లబ్బులు, సింగిల్ నంబర్ లాటరీలను 24 గంటల్లోగానే అదుపు చేయవచ్చన్నారు. అయితే ఎందుకు అలా జరగడం లేదని ప్రశ్ని స్తూ, ప్రతిపక్షాలు దీనిపై శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయని తెలిపారు. కాగా పోరాటాల సందర్భంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆత్మహత్యలు లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతూ, వీటిని నివారించడానికి ఆత్మహత్యల నిరోధక దళాన్ని ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఈ సమావేశంలో హోం మంత్రి కేజే. జార్జ్, డీజీపీ లాల్‌రుకుం పచావ్ పాల్గొన్నారు.