నల్ల కోళ్లు పైసలు ఫుల్లు | Karnataka Farmer Profits With Kadaknath Hens Business | Sakshi
Sakshi News home page

నల్ల కోళ్లు పైసలు ఫుల్లు

Published Fri, Dec 27 2019 8:10 AM | Last Updated on Fri, Dec 27 2019 2:21 PM

Karnataka Farmer Profits With Kadaknath Hens Business - Sakshi

ఖడక్‌నాథ్‌ కోడి , ఖడక్‌నాథ్‌ కోళ్ళ పెంపకం షెడ్‌

కర్ణాటక, సిరుగుప్ప: వ్యవసాయంలో సరైన ఆదాయం లేక, మధ్యప్రదేశ్‌కు చెంది ఖడక్‌నాథ్‌ కోళ్ళ పెంపకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు శశిధరగౌడ అనే రైతు. బళ్లారి జిల్లా తాలూకాలోని శాలిగనూరు గ్రామంలో ఉండే  రైతు శశిధరగౌడ పెంచుతున్న నల్లజాతి కోళ్లు ఇతోధికమైన లాభాలను ఇస్తున్నాయి. ఈకల నుంచి మాంసం వరకు మొత్తం నల్లగా ఉండే ఈ కోళ్లు ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. 

ఒక్కో పెట్ట 150 గుడ్లు  
 రైతు గౌడ మొత్తం నాలుగు లక్షలు డిపాజిట్‌ చేసి 600 కోడి పెట్టలు 120 కోడి పుంజులను నాలుగు యూనిట్‌గా తీసుకొన్నారు. వీటిని తెచ్చిన నెల రోజులకు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి. రోజు విడిచి రోజు 100 నుండి 150 వరకు గుడ్లు పెడతాయి. మొదట వ్యాపార ఒప్పందం ప్రకారం ఒక గుడ్డు ధర రు.15 కింద కోళ్ల సరఫరాదారే కొంటారు. వీటిని అరబ్‌ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారన్నారు. స్థానికంగానూ గిరాకీ ఉంది.  

ఆహారం ఏమిటి 
ఈ కోళ్ళు అన్నిరకాల ఆకుకూరలైన టమోటా, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పొలంలో వ్యర్థంగా పెరిగే గౌరి పల్లె, రాజగూర పల్లె తదితర నానా ఆకులను తింటాయి. ప్రతి దినం మిశ్రమం చేసిన ధాన్యాన్ని ప్రతి కోడికి 100 గ్రాములు ఇస్తారు. ఫారంలో నేలపై రాలిన ధాన్యం పొట్టు, కోడి ఈకలు, రెట్టలను కలిపి పొలాలకు ఎరువుగా వాడవచ్చు. ప్రతి నెలా ఫారంను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు దరిచేరవు. వైద్యుల సూచనల ప్రకారం వాటికి వైరస్‌ వ్యాధులు సోకకుండా ఔషధాలు ఉపయోగిస్తూ ఉండాలని చెప్పారు.  

రూ.7 లక్షల ఆదాయం 
కోళ్ళను, గుడ్లను కొనేందుకు ఒక ఆర్గానిక్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చున్నామని రైతు తెలిపారు. రోజుకు కోళ్లకు 75 కేజీల దాణా పెడతారు. సీజన్‌కు కోళ్ల మందులకు రూ.12 వేలు, షెడ్‌కు రూ.2 లక్షలు, నెలకు కూలీలకు రూ.25 వేలు, నాలుగు నెలలకు కరెంటు ఖర్చు రూ.35 వేలు ఇలా మొత్తం కలిపి రూ.7.50 లక్షల వరకు ఖర్చవుతుందని రైతు తెలిపారు. 600 కోళ్ల నుంచి సరాసరి 100 గుడ్లు, కోడి ధర రూ.550 ప్రకారం రూ.14 లక్షల వరకూ ఆదాయం వస్తుందని, ఇందులో ఖర్చులు పోను రూ.7 లక్షల వరకూ ఏడాదికి ఆదాయం వస్తుందని తెలిపారు.  

గుడ్లు, మాంసం ఆరోగ్యదాయకం
కొంతకాలం కిందట మధ్యప్రదేశ్‌ నుంచి 5 నెలల వయస్సున్న 720 కోడిపిల్లలను తెచ్చి తమ ఫారంలో పెంపకం ఆరంభించినట్లు గౌడ తెలిపారు.  ఈ కోళ్ళకు పలు ఆరోగ్య లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ కోళ్ల గుడ్లు, మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండం వల్ల సుగర్, గుండెజబ్బులు ఉన్నవారు కూడా నిక్షేపంగా తినవచ్చునని చెప్పారు. సాధారణ బాయ్లర్, నాటు కోళ్ల మాంసం కంటే రుచిగా ఉంటుందని చెప్పారు. ఈ నల్ల కోళ్ళను ఇళ్ల వద్ద మామూలు కోళ్లమాదిరిగానే పెంపకం సాగించవచ్చు. ఇవి స్వల్ప వ్యధిలోనే పెద్ద సైజుకు ఎదుగుతాయి. దండిగా గుడ్లనూ పెడతాయి. కోళ్ల సరఫరాదారుల వద్ద రూ. ఒక లక్ష డిపాజిట్‌ చేసినట్లైతే 150 కోడి పెట్టలు, 30 కోడి పుంజులు కలిపి యూనిట్‌గా అందజేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement