
లంక నుండి క్షేమంగా తిరిగివచ్చిన పర్యాటకులు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: శ్రీలంకలో పేలుళ్లకు ముందు రోజు ఆ దేశానికి కర్ణాటక నుండి టూర్ వెళ్లిన సుమారు 15 మంది మంగళవారం సాయంత్రం శ్రీలంక నుండి తిరిగివచ్చారు. కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో దిగిన వారందరినీ కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బెంగళూరు బాగలగుంటె నివాసులయిన నవీన్, ప్రవీణ్, కిట్టి తదితరులు ప్రాణాలతో ఇండియాకు తిరిగి వస్తామనుకోలేదన్నారు.
బ్లాస్ట్ జరిగిన షాంగ్రిల్లా హోటల్ పక్కనే మరో హోటల్‌లో తామంతా దిగామని, పేలుళ్లు సంభవించడానికి 20 నిమిషాల ముందు బయటకు వచ్చి తిరగడానికి బయలుదేరామన్నారు. ట్యాక్సీలో కొంతదూరం వెళ్లగానే ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ వచ్చిందని, వెంటనే తామంతా సంఘటనాస్థలానికి వచ్చామన్నారు. పేలుళ్లలో మృతి చెందిన ఏడుగురు జేడీఎస్ నాయకుల మృతదేహాలను తామే గుర్తించామని చెప్పారు. తమకు భారత రాయబారి కార్యాలయం వారు సహాయం చేసారని, జీవితంలో ఆ సంఘటనను మర్చిపోలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment