మా ఆదేశాలు పాటించాల్సిందే
♦ తమిళనాడుకు 18 వేలక్యూసెక్కుల కావేరి నీరివ్వండి
♦ కర్ణాటకకు సుప్రీం ఆదేశం
సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కావేరి నీటిని తమిళనాడుకు వదిలే విషయమై ఈ నెల ఐదు నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘కర్ణాటక మొండి పట్టుదల వల్ల ప్రతిసారీ మీ వద్దకు రావాల్సి వస్తోంది.
బెంగళూరు కావేరి పరీవాహక ప్రాంతంలోనిది కాకపోయినా, అక్కడివారి తాగునీటి కోసం కావేరి జలాలను ఉపయోగించడం సరికాదు. సమస్య పరిష్కారానికి కేంద్రాన్ని మధ్యవర్తిత్వం వహించేలా ఆదేశించండి’ అని తమిళనాడు తొలుత కోర్టును కోరింది. ‘ఈ సమయంలో కేంద్రం కలుగజేసుకోవడానికి వీలవుతుందా’ అని అటార్నీ జనరల్ రోహ త్గీని కోర్టు ప్రశ్నించగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇద్దరు సీఎంలు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలనికోర్టు సలహా ఇచ్చింది. తర్వాత కర్ణాటక తరఫున ఫాలీనారిమన్ వాదనలు వినిపించారు.
‘రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నీటిని నవంబర్ వరకూ వదలడం వీలవదు’ అని తెలిపారు. ‘ఇప్పుడు లేనిది అప్పుడు ఎలా వదులుతార’ని కోర్టు ప్రశ్నించింది. ‘దేవుని దయ. ఆలోగా వానలు కురవొచ్చ’ని ఆయన అన్నారు. నారిమన్ ఉభయసభల తీర్మానాన్ని ప్రస్తావించగా, న్యాయమూర్తులు కొంత గట్టిగా ‘ మా ఆదేశాన్ని పాటించాల్సిందే. సమాఖ్య విధానంలో పొరుగు రాష్ట్రాల అవసరాలను సంబంధిత రాష్ట్రాలు గుర్తించాలి’ అంటూ తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేశారు. తాజా ఆదేశంతో ఈ వివాదంపై ఈ నెలలోనే నాలుగుసార్లు కర్ణాటకకు సుప్రీంలో చుక్కెదురైంది. కాగా, తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రిలోనే ఈ అంశంపై భేటీ నిర్వహించారు.