చిదంబరం తనయుడికి ఊరట
సాక్షి, చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి మద్రాస్ హైకోర్టులో ఊరట కలిగింది. సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో చేరుస్తూ జారీ చేసిన లుకౌట్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అడ్డంకి తొలగినట్లయింది. కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతున్న కార్తీ ఓ వ్యాపార వేత్త కూడా.
ఆయన వివిధ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని, విదేశీ మారకం విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల పేరిట ఐటీ, సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే, ఈ సంస్థలు నిర్వహిస్తున్న విచారణకు కార్తీ హాజరుకావడం లేదని ఆయనపై లుకౌట్ నోటీసులను విడుదల చేసింది. సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో కార్తీని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఆయన విదేశీయానంపై నిషేధం విధించింది. అయితే, లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..వీటిని వ్యతిరేకిస్తూ కార్తీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. షెల్ కంపెనీల నుంచి భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీపై సీబీఐ అభియోగం.