►కొనసాగుతున్న చికిత్స
► శుక్రవారం డిశ్చార్జ్ కు అవకాశం
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం కరుణానిధికి మంగళవారం ఆరో రోజుగా కావేరి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఇన్ఫెక్షన్ కాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ను చూడడానికి ఎవర్నీ అనుమతించ లేదు. పీఎంకే అధినేత రాందాసు, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాలతో పాటు పలువురు ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఇన్ఫెక్షన్
కారణంగా ఈనెల పదిహేనో తేదీన కరుణానిధి రెండోసారిగా ఆళ్వార్ పేట కావేరి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే.
ఆయనకు వైద్య చికిత్సలు వేగవంతం చేశామని, రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్ల వచ్చనట్టుగా వైద్య వర్గాలు ప్రకటించాయి. అయితే, కరుణానిధికి చికిత్స కొనసాగుతుండడంతో డీఎంకే వర్గాల్లో ఆందోళన కలుగుతోంది. వీరికి భరోసా ఇచ్చే విధంగా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ వస్తున్నారు. మంగళవారం ఆయన డిశ్చార్జ్ కావచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అందుకు తగ్గ పరిస్థితులు కానరాని దృష్ట్యా, తమఅధినేత ఎప్పుడు ఆసుపత్రి నుంచి బయటకు వస్తారోనన్న ఎదురు చూపులు డీఎంకే వర్గాల్లో పెరిగాయి. మంగళవారం కూడా కరుణానిధికి వైద్య చికిత్సలు కొనసాగించారు.ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గే వరకు ఆయన ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని, అంత వరకు ఆయన్ను చూడడానికి ఎవ్వరికీ ఆసుపత్రి వర్గాలు అనుమతి ఇవ్వ లేదు.
శుక్రవారం డిశ్చార్జ్ కు అవకాశం : కరుణానిధిని పీఎంకే అధినేత రాందాసు పరామర్శించేందుకు కావేరి ఆసుపత్రి వద్దకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారు. ఆయన్ను డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. ఆయన వెంట పీఎంకే సీనియర్ నాయకుడు ఏకే.మూర్తి సైతం ఉన్నారు. పదిహేను నిమిషాల పాటు ఆసుపత్రి వద్ద ఉన్న రాందాసు తదుపరి మీడియాతో మాట్లాడారు. తన ప్రియ మిత్రుడి ఆరోగ్యం మెరుగు పడుతున్నదని పేర్కొన్నారు. వందేళ్ల పాటుగా సంపూర్ణ ఆరోగ్యంగా మన ముందు ఆయన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నందున, కరుణానిధిని తాను చూడ లేదన్నారు. ఇంటికి వచ్చాక, వెళ్లి పరామర్శిస్తానన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి , ఎంపీ డి.రాజా కరుణను పరామర్శించేందు కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుని, కాసేపు అక్కడే ఉన్నారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడుతున్నదని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కుటుంబీకులు, వైద్యులు పేర్కొన్నట్టు చెప్పారు. ఇక, కరుణానిధిని బీజేపీ నేత మోహన్ రాజులు, మాజీ ఐఎఎస్ అధికారి చంద్రలేఖ, సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్, హాస్య నటుడు వివేక్, మాజీ ఎంపీ విశ్వనాథన్ పరామర్శించేందుకు వచ్చిన వారిలో ఉన్నారు.
మూడున జల్లికట్టు కోసం ఆందోళన :
డీఎంకే నేతృత్వంలో జనవరి మూడో తేదీన జల్లికట్టు సాధన లక్ష్యంగా మధురై జిల్లా అలంగానల్లూరులో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు డీ ఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రకటించా రు. అన్ని పార్టీల నేతలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.