కోర్టుకు రండి! | Karunanidhi asked to appear before Tenkasi court | Sakshi
Sakshi News home page

కోర్టుకు రండి!

Published Thu, Feb 6 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

Karunanidhi asked to appear before Tenkasi court

సంస్థాగత ఎన్నికలపై ఓ వార్డుకు చెందిన చోటా నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తెన్‌కాశి కోర్టు స్పందించింది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యద ర్శి అన్భళగన్ కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.
 
 సాక్షి, చెన్నై:సంస్థాగత ఎన్నికల ద్వారా పార్టీ కార్యవర్గాల ఎంపికలో డీఎంకే వర్గాలు నిమగ్నమైన విషయం తెలి సిందే. అయితే, ఈ ఎన్నికలు సజావుగా జరగడం లేదని, తమకు కావాల్సిన వాళ్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు డీఎంకే అధిష్టానానికి చేరుతూ వస్తున్నాయి. దక్షిణాదిలో సంస్థాగత ఎన్నికలు మమ అనిపించడంతోనే అధిష్టానంపై అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగ్రహాలు, ఫిర్యాదులు ఓ వైపు ఉంటే, ఓ చోటా నాయకుడు ఏకంగా కోర్టుకెక్కాడు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ  ఆ నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌తో అధినాయకులకు సమన్లు జారీ అయ్యూరుు. పిటిషన్: తిరునల్వేలి జిల్లా తెన్‌కాశి పరిధిలోని మహ్మద్ హుస్సేన్ స్థానిక కోర్టులో రెండు రోజుల క్రితం పిటిషన్ వేశాడు. తెన్‌కాశి పరిధిలో 33 వార్డులు ఉన్నాయని. ఆ వార్డు కమిటీలకు సంస్థాగత ఎన్నికల ద్వారా కార్యవర్గాల ఎంపికకు తమ పార్టీ నిర్ణయించిందని గుర్తు చేశారు.
 
 తాను ఆ పార్టీ కోసం సేవలందిస్తూ వస్తున్నానని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా తన వార్డులో 
 పోటీ చేసి, పదవిని చేజిక్కించుకోవాలన్న ఆశతో ఉన్నట్టు పేర్కొన్నారు. పది వార్డుల్లో పదవులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 23 వార్డులకు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. తొమ్మిదో వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ నిమిత్తం తాను నామినేషన్ వేసినట్టు పేర్కొన్నారు. అయితే, ఎన్నికలు నిర్వహించకుండానే, ఉన్నట్టుండి అన్ని వార్డులకు పదవులు భర్తీ చేయడానికి కసరత్తులు చేశారని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా, తమకు కావాల్సిన వాళ్లతో జాబితా సిద్ధం చేసి ప్రకటించేందుకు సిద్ధమయ్యారని కోర్టు దృష్టికి తెచ్చారు. డీఎంకేలో సాగుతున్న తంతంగంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి గౌతమన్ బుధవారం విచారణకు స్వీకరించారు. 
 సమన్లు: విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఇసక్కి తన వాదన వినిపించారు. 
 
 అన్ని నిబంధనలకు లోబడి సంస్థాగత ఎన్నికల ద్వారా కార్యవర్గాల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసినా, చివరకు ఎన్నికలు జరపకుండానే కార్యవర్గాల్ని ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా, బాధ్యత కల్గిన పార్టీగా ఉన్న డీఎంకేలో ఈ తంతు జరగడాన్ని తన పిటిషనర్ తీవ్రంగా ఖండిస్తున్నారని, ఆయనకు న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో తదుపరి విచారణను మార్చి మూడో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, ఆ రోజు విచారణకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, తిరునల్వేలి జిల్లా పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ విశ్వనాథన్ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. వార్డు నాయకుడు వేసిన పిటిషన్ అధినేతలను కోర్టుకు రప్పించేందుకు దారి తీయడం తిరునల్వేలి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement