ఆదివారం మధ్యాహ్నం ఐసీయులో కరుణ. సాధారణ స్థితిలో ఉన్నట్టు చూపుతున్న పల్స్ రేట్
అభిమానుల పూజలు, ప్రార్థనలతో కావేరి ఆస్పత్రి పరిసరాలు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకుమునిగాయి. అధినేత కరుణానిధిక్షేమంగా తమ ముందుకు వస్తారన్నఆశతో అభిమానులు ఎదురుచూశారు.ఈ సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శతో విడుదలైనఫొటో ఆ కరుణ సేనల్లో ఆనందాన్ని నింపింది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తమ ముందుకు అధినేత వస్తారన్న ఆశాభావంతో కరుణ వర్ధిలాల్లి అన్న నినాదాల్ని మార్మోగింది. సాయంత్రం వరకు ఉన్న ఈ ఆనందం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా మారింది. ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనడంతో కరుణ ఆరోగ్యం విషమించిందా? అన్న ఆందోళన నెలకొంది. ఇందుకు తగ్గట్టుగా కుటుంబసభ్యులు అందరూ ఆస్పత్రికి చేరుకోవడంతో అనుమానాలు బయలుదేరాయి. చివరకురాత్రి 9.50 గంటలకు ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేయడంతోఉత్కంఠకు తెరపడింది.
సాక్షి, చెన్నై : కరుణానిధి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం డీఎంకే శ్రేణుల్ని ఆందోళనలో పడేశాయి. ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రిలో కరుణకు అందిస్తున్న చికిత్స వివరాలు, బులిటెన్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆస్పతి నుంచి బయటకు వస్తారన్న ఆశాభావం ఉన్నా, ప్రచారాలు, పుకార్లతో డీఎంకే వర్గాల్లో తెలియని భయం, ఆందోళన నెలకొన్నాయి. దీంతో తమ అధినేత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు చెన్నైకి ఆయా జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయాన్నే కావేరి ఆస్పత్రి పరిసరాల్లోకి డీఎంకే కేడర్ రాక పెరిగింది. తాకిడి క్రమంగా ఎక్కువ కావడంతో పోలీసులు ఆ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లుచేశారు. ఆస్పత్రి పరిసర మార్గాల్లో ట్రాఫిక్ మార్పులుచేశారు. వచ్చిన కరుణ సేనలు తమ అధినేత ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రార్థనల్లో నిమగ్నం అయ్యారు. కరుణ చిత్ర పటాల్ని చేతబట్టి వందేళ్లు వర్థిల్లు అంటూ నినాదాల్ని హోరెత్తించారు. ఆస్పత్రి నుంచి ఆరోగ్యం మెరుగుపడ్డట్టుగా ఏదేని సమాచారం వస్తుందని ఎదురుచూసిన కేడర్‌కు కరుణానిధి ఫోటో విడుదల కావడం ఆనందాన్ని నింపింది. అది కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాకతో ఆ పరామర్శ ఫొటో మీడియాకు చేరింది.
ఉప రాష్ట్రపతి పరామర్శతో ఆనందం
సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, మత్స్యశాఖ మంత్రి జయకుమార్ కావేరి ఆస్పత్రికి వచ్చారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో వెంకయ్య నాయుడు కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరుణ ఆరోగ్యం గురించి వైద్యులు ఆయనకు వివరించారు. అలాగే, స్టాలిన్, కనిమొళి, కరుణ సతీమణి రాజాత్తి అమ్మాల్‌లతో కలసి ఐసీయూలోకి వెంకయ్య నాయుడు, బన్వరిలాల్ వెళ్లి మరీ కరుణానిధిని పరామర్శించారు. ఈ ఫొటో మీడియాకు విడుదల కావడం, ఇందులో వెంటిలేటర్ లేకుండా కరుణానిధి కనిపించడంతో డీఎంకే శ్రేణుల్లో ఆనందం మిన్నంటింది. అధినేత ఆరోగ్యం కుదుటపడుతోందని, తమ ముందుకు సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా వస్తారన్న ఆశాభావంతో కరుణ వర్థిల్లాలి అన్న నినాదాన్ని మార్మోగించారు. అలాగే, కరుణ ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ ఆదివారం అనేక మందిరాల్లో ప్రార్థనలు జరిగాయి. కాగా, కరుణానిధి తనంతకు తాను శ్వాస పీల్చుకుంటున్నారని, అవసరాన్ని బట్టి కృత్రిమ శ్వాస అప్పుడప్పుడు అందిస్తున్నట్టుగా ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు.
పరామర్శల వెల్లువ
కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కావేరి ఆస్పత్రికి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టాలిన్, కనిమొళిలతో వారంతా భేటీ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కరుణ సంపూర్ణ ఆర్యోగవంతుడిగా మళ్లీ ప్రజా సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు నేతలు పేర్కొన్నారు. కావేరి ఆస్పత్రికి పరామర్శ నిమిత్తం వచ్చిన వారిలో బీజేపీ నేతలు మురళీధరరావు, ఇలగణేషన్, తమిళిసై సౌందరరాజన్, సీపీ రాధాకృష్ణన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కార్యదర్శి డి.రాజ, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తరఫున ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, ఎండీఎంకే నేత వైగో, ద్రవిడ కళగం నేత వీరమణి, రైతు సంఘం నేత టీఆర్ పాండియన్, మదురై ఆధీనం అరుణగిరినాథర్, సినీ నటుడు సత్యరాజ్, తదితరులు ఉన్నారు.
సీమాన్ రాకతో ఉద్రిక్తత
సీమాన్ ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరుణానిధి ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్నది నామ్ తమిళర్ కట్చి వర్గాలే అనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా డీఎంకే శ్రేణులు నినాదాల్ని హోరెత్తించాయి. దీంతో సీమాన్ స్పందిస్తూ, అది తమ వాళ్ల పని కాదు అని వివరణ ఇచ్చారు. పుకార్లు, ప్రచారాలు సృష్టిస్తున్న వాళ్లను వదలిపెట్టకూడదని హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అలాగే, ఎండీఎంకే నేత వైగో ఆస్పత్రికి రాగా, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు కారణం లోపల ఉపరాష్ట్రపతి ఉండడమే. దీంతో కేడర్‌తో పాటు ఓ మూలన వైగో కాసేపు నిల్చున్నారు. ఉపరాష్ట్రపతి వెళ్లిన అనంతరం ఆయన్ను పోలీసులు లోనికి అనుమతించారు.
అయ్యా ఎలా ఉన్నారు..
కరుణ సతీమణి దయాళు అమ్మాల్ వయో భారంతో గోపాలపురం ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్న ఆమె వెన్నంటి కుమార్తె సెల్వి, అళగిరి కుటుంబీకులు ఉన్నారు. ఇంటి వద్దకు ఎవరు వచ్చినా అయ్యా.. ఎలా ఉన్నారు...ఆస్పత్రిలో ఆయనతో ఎవరు ఉన్నారు.. అని పదే పదే ఆమె వాకబు చేశారు.
మరో ముగ్గురు మరణం
కరుణానిధి ఆస్పత్రిలో ఉన్న సమాచారం తట్టుకోలేక డీఎంకే వర్గాల గుండెలు ఆగుతున్నాయి. ఆదివారం మరో ఇద్దరు గుండెపోటుతో మరణించారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎన్నూరు అన్నై శివగామి నగర్‌కు చెందిన కార్యకర్త ఎస్.రాజు ఉన్నాడు. గుండె ఆగడంతో మరణించిన వారిలో వేలూరు అల్లాపురం డీఎంకే ఇన్‌చార్జ్ నాగరాజ్, కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి కొలక్క పాళయం నాలుగో వార్డు ఇన్‌చార్జ్ హంస కుమార్‌లు ఉన్నారు.
ఒక్క సారిగా ఉత్కంఠ భరితం
సరిగ్గా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రి పరిసరాల్లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కరుణ ఆరోగ్యం విషమించినట్టుగా సమాచారం ఊపందుకోవడంతో ఒక్కసారిగా డీఎంకే శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత బయలుదేరింది. ఆస్పత్రి పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని పోలీసుస్టేషన్లలోని సిబ్బంది అంతా రోడ్డు మీదకు వచ్చేశారు. ఎక్కడికక్కడ భద్రత ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచారు. ఇది డీఎంకే వర్గాల్లో ఆందోళనకు దారితీసింది.
అదే సమయంలో కరుణానిధి కుటుంబ సభ్యులు అందరూ ఆస్పత్రిలోకి వెళ్లడంతో కరుణకు ఏమైందోనన్న ఉత్కంఠ రెట్టింపు అయ్యింది. డీఎంకే ముఖ్య నాయకుల్ని మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతించారు. బయటి వ్యక్తులు ఎవ్వరినీ ఆ పరిసరాల్లోకి అనుమతించక పోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎడుపులు పెడబొబ్బలు పెరిగాయి.
శనివారం ఎనిమిది గంటల సమయంలో బులిటెన్ విడుదల చేసిన ఆస్పత్రి వర్గాలు ఆదివారం ఎలాంటి బులిటెన్ విడుదల చేయక పోవడంతో ఆందోళన క్రమంగా పెరిగింది. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ప్రచారం ఊపందుకోవడంతో టెన్షన్ వాతావరణ బయలుదేరింది. చివరకు 9.50 గంటలకు ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ను విడుదల చేశాయి. అందులో కరుణానిధి ఆరోగ్యం కాస్త వెనక్కు తగ్గిందని, అందుకు తగ్గ వైద్య పరీక్షలు చేయడంతో పరిస్థితి కుదుట పడ్డట్టు వివరించారు. ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రకటించడంతో ఉత్కంఠ కాస్త తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment