కూటమిలో చేరండి
కాంగ్రెస్‌కు కరుణ ఆహ్వానం
ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం
చెన్నై : తమ కూటమిలోకి రావాలని కాంగ్రెస్‌కు డీఎంకే అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వికసించింది. డీఎండీకేను కూటమిలోకి ఆహ్వానించిన డీఎంకే అధినేత ఎం కరుణానిధి తమ ఊసెత్తక పోవడం కాంగ్రెస్ వర్గాల్ని జీర్ణించుకోలేకుండా చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ నేతృత్వంలో కూటమి లేదా, ఒంటరి పయనం అన్న నినాదాల్ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అందుకున్నారు.
రోజుకో వ్యాఖ్యల్ని ఈయన సందిస్తుండడంతో కాంగ్రెస్ వర్గాలు అయోమయంలో పడక తప్పలేదు. తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటు సాధ్యం కాదన్న విషయాన్ని పరిగణించిన కాంగ్రెస్ వర్గాలు, ఈ ఎన్నికల్ని కూడా ఒంటరిగా ఎదుర్కోవాల్సిందేనా అన్న డైలమాలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కూటమిలోకి రావాలని అన్ని పార్టీలకు తాను ఆహ్వానం పలికానని, ఇందులో కాంగ్రెస్ కూడా ఉందని వ్యాఖ్యానించారు.
తమను అక్కున చేర్చుకునేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమవుతూ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వికసించింది. డీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొంటే,కొన్ని సీట్లైనా గెలుచుకోవచ్చని, ఒంటరిగా ఎదుర్కొంటే, లోక్ సభ ఎన్నికల్లో పట్టి గతే ఎదురై ఉండేందని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, కరుణానిధి తమకు ఆహ్వానం పలకడంతో ఈవీకేఎస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన ఇచ్చిన పిలుపును తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాననని, తుది నిర్ణయం తమ అధినేత్రి సోనియాగాంధీ తీసుకుంటారని పేర్కొన్నారు.
ఇప్పటికే డీఎంకే నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా..? అన్న ఎదురు చూపుల్లో ఉన్న ఢిల్లీలోని పలువురు కాంగ్రెస్ పెద్దలు కరుణానిధి ఇచ్చిన పిలుపుతో హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇక, డీఎంకేతో కాంగ్రెస్ మళ్లీ దోస్తి కట్టడం ఖాయం అన్నది తాజా పరిణామాలతో స్పష్టం అవుతోంది.