బెంగళూరు : పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడి కెంపేగౌడ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని చామరాజపేట లక్ష్మిపురలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడి మరణాన్ని జీర్ణించుకోలేక బంధువులు పోలీసుల బైక్‌ను తగలబెట్టారు. రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు స్థానిక సీఐని సస్పెండ్ చేయడంతో పాటు ముందుజాగ్రత్త చర్యగా కేఎస్‌ఆర్‌పీ బలగాలను రంగంలోకి దింపారు. మృతుడు ప్రదీప్ (24) మృతదేహానికి విక్టోరియాలో వైద్య పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇక్కడి చామరాజపేటలోని విద్యుత్ స్మశానవాటికలో ప్రదీప్ అంత్యక్రియలు నిర్వహించారు. ఫిర్యాదిదారులు పరారీ కావడంతో వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... కేఎస్‌ఐసీలో పనిచేస్తున్న ఈరణ్ణకు ప్రదీప్ (24), సందీప్ అనే ఇద్దరు కుమారులు.
లక్ష్మిపురలో నివాసముంటున్న వీరు పైఅంతస్తును దంపతులకు అద్దెకు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మధ్యాహ్నం ప్రదీప్ పని ముగించుకుని మిద్దెపైకి వచ్చాడు. అక్కడ చెత్త ఉండటంతో అద్దెకు ఉంటున్న మహిళను ప్రశ్నించాడు. ఆమె ఇంటి యజమానికి కుమారుడు అని తెలియక ఎవరో యువకుడు వేధిస్తున్నాడని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రదీప్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.
వేధించారని ఆత్మహత్య : ప్రదీప్‌ను నాలుగు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. హాకీస్టిక్‌లు, రాడ్‌లతో తనను చిత్రహింసలకు గురి చేశారని ప్రదీప్ స్నేహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. రూ. 90 వేలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని పోలీసులు ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం ప్రదీప్‌ను ఇంటికి తీసుకు వచ్చారు. తరువాత ప్రదీప్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాత్రి ఇంటికి వచ్చిన అతని సోదరుడు సందీప్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ బైక్‌లో ఇంటి దగ్గరకు వెళ్లారు. అంతే స్థానికులు సహనం కోల్పోయి ఇద్దరిపై దాడి చేసి బైక్‌కు నిప్పంటించారు. పోలీసులు అక్కడి నుంచి తప్పించుకున్న ఇద్దరు కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కెంపేగౌడ సీఐ సస్పెన్షన్ : బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి, అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి ఆత్మహత్య నేపథ్యంలో కెంపేగౌడనగర పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ సీ.డీ. నాగరాజ్‌ను సస్పెండ్ చేశామని అడిషనల్ పోలీసు కమిషన ర్ అలోక్ కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసుల అధికారులు చెప్పారు.
పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య ?
Published Mon, Aug 25 2014 3:22 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement