అమ్మ మరణంపై అనుమానాలను నివృత్తి చేయండి
చెన్నై( కొరుక్కుపేట):
అమ్మ జయలలిత మరణంపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, అతని మంత్రి వర్గం కేంద్రాన్ని సీబీఐ విచారణకు డిమాండ్ చేసినప్పుడే అమ్మకు మీరిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జయలలిత జయంతిని పురస్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో 10 రోజుల పండుగలో భాగంగా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పలు సాంఘిక సేవా కార్యక్రమాలను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని స్వతంత్రనగర్‌లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
అంతకుముందు అమెరికాలో జాతి వివక్షకు బలైన భారతీయుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ జయలలిత జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఏటా ఇచ్చే ‘అమ్మా యంగ్ ఇండియా’ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్న 75 రోజులు హాస్పిటల్‌లో జరిగిన సంఘటనలు, పొంతనలేని ప్రకటనలు, ఆమ్మను కలిసేందుకు వచ్చిన వారిని కలవనీయకుండా చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, దీనిపై పలు పోరాటాలు చేశామని సుప్రీంకోర్టులో కేసు, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించినట్టు తెలిపారు.
ఉద్యమంలో భాగంగా పోస్టుకార్డుల ద్వారా నిరసనలు చేపట్టామని, తిరుపతి వెంకన్న హుండీలో సీబీఐ విచారణ కోరుతూ వినతిపత్రం వేసినట్టు తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సానుకూలంగా స్పందిస్తోందని పేర్కొన్నారు. ఐదురాష్ట్రాల ఎన్నికల తరువాత కేంద్రం కచ్చితంగా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందనే నమ్మకం ఉం దన్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని జయలలిత కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు విచారణ గురించి ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం వింతగా ఉందన్నారు. ప్రతిపక్షాలు కూడా అమ్మ మరణంపై సీబీఐ విచారణ కోసం ప్రజా ఉద్యమాలు చేసేందుకు పార్టీలకు అతీతంగా ముం దుకు రావాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.