హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నిప్పులు చెరిగారు. సదరు పార్టీ నేతలకు పనీపాట లేదని ఆయన ఎద్దేవా చేశారు. నాటకాలాడటం వాళ్లు అలవాటైందంటూ ఆప్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కాదని ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని ఆప్ నేతలకు కిరణ్ రిజుజు సూచించారు.
ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రిజుజు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ రిజాజు మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్డీఏ రెండేళ్ల పాలన సాగిందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేంద్ర నిధులు ప్రజలకు చేరువ కావడం లేదని విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం అందిస్తున్న నిధులతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి వరకూ అందలన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపి... ఎమర్జెన్సీని విధించిన రోజును ఎవరూ మరవరన్నారు. ఎమర్జెన్సీలోని వాస్తవాలు ఈ తరం వారికి తెలియాల్సిన అవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అప్పటి ఎమర్జెన్సీలో పాల్గొన్న వారిని కిరణ్ రిజుజు సత్కరించారు.