సాక్షి, చెన్నై: సబ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడిలో ఉన్న తండ్రి కుమారుల మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసింది. మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక నగరాల్లో బుధవారం వర్తకులు నిరసనలకు దిగారు. దుకాణాలన్నీ మూసి వేశారు. సెల్ సర్వీసు సెంటర్లు మూతపడ్డాయి. బాధిత కుటుంబానికి రూ. 2 కోట్లు నష్ట పరిహారం ప్రకటించాలని వర్తక లోకం డిమాండ్ చేసింది. తన తండ్రి, సోదరుడిని హతమార్చిన పోలీసులపై హత్య కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించే వరకు మృత దేహాలను తీసుకునే ప్రసక్తే లేదని జయరాజ్ కుమార్తెలు స్పష్టం చేశారు.
తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్ కులంకు చెందిన జయరాజ్(63), కుమారుడు ఫినిక్స్(31) జ్యుడీషియల్ కస్టడిలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. లాక్ నిబంధనలను ఉల్లంఘించారన్న చిన్న కారణంతో పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఖాకీల దాష్టీకాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్తకులు నిరసనలకు దిగారు. వణిగర్ సంఘం పేరవై నేతృత్వంలోని అన్ని దుకాణాలు తూత్తుకుడి, తిరునల్వేలి, మైలాడుతురై, మదురై, కడలూరు, తిరుచెందూరుల్లో నిరసనల్ని హోరెత్తించాయి. యజమానాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ దుకాణాల ఎదుట నిరసన చేపట్టారు.
సుమోటోగా కేసు
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, మరో పదిహేను మందిని బదిలీ చేశారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనను తీవ్రంగానే కొర్టు పరిగణిస్తోంది. లాకప్ డెత్‌లకు ముగింపు లేదా ..? అని న్యాయమూర్తులు ప్రకాష్, పుగలేంది నేతృత్వంలోని బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గంటల వ్యవధిలోనే డీజీపీ, తూత్తుకుడి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే సీఎం పళని స్వామితో కరోనా నివారణ చర్యలపై డీజీపీ కాన్ఫరెన్స్‌లో ఉండడంతో కుదరలేదు. దీంతో ఆయన తరపున డీఐజీ విచారణకు హాజరు అయ్యారు. తాము చేపట్టిన చర్యలను కోర్టు ముందు ఉంచారు. విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్ 26వ తేదికి వాయిదా వేశారు. అలాగే మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తిగా వీడియో చిత్రీకరణ జరగాలని, విచారణను కోర్టు పర్యవేక్షిస్తుందని ఆదేశించారు.
చిక్కుల్లో మేజిస్ట్రేట్
ఆ ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన కోవిల్పట్టి మేజిస్ట్రేట్ ఈ వివాదంలో ఇరుక్కున్నట్టుగా పరిస్థితి మారింది. చెన్నైకు చెందిన న్యాయవాది సూర్యప్రకాశం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు సుందరేష్, కృష్ణకుమార్ బెంచ్ ముందు హాజరయ్యారు. తండ్రి కుమారులను రిమాండ్‌కు తరలించే ముందు ఎందుకు వైద్య పరీక్షలకు న్యాయమూర్తి ఆదేశించలేదని ప్రశ్నించారు. దీంతో పిటిషన్ దాఖలు చేయాలని, విచారిస్తామని న్యాయమూర్తులు సూచించారు. కోవిల్ పట్టి మేజ్రిస్టేట్ భాగస్వామ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం విచారణ జరగనుంది.
హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్
ఇద్దరి మృతదేహాలను తిరునల్వేలి జిల్లా పాళయం కోటై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మధ్యాహ్నం పోస్టుమార్టం జరిగింది. అయితే మృతదేహాలను తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. జయరాజ్ సతీమని సెల్వరాణి , ముగ్గురు కుమార్తెలు కన్నీటి పర్యంతంతో మీడియా ముందుకు వచ్చారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేసే వరకు మృతదేహాలను తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు. మరోవైపు తూత్తుకుడి ఘటన రాష్ట్రవాప్తంగా కలకలం రేగుతుంటే సీఎం పళని స్వామి మౌనంగా ఉండడం శోచనీయమని ఎంపీ కనిమొళి ట్విట్టర్‌లో విమర్శించారు. అలాగే హత్య కేసు నమోదు చేయాలని డీజీపీ జేకే త్రిపాఠికి కనిమొళి ఫిర్యాదు చేశారు.
స్పందించిన సీఎం
ఈ ఘటనపై సీఎం పళనిస్వామి బుధవారం స్పందించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తండ్రి కుమారుల మరణానికి సంతాపం తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని..రూ. 20 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశించడంతో జయరాజ్, ఫినిక్స్ కుటుంబానికి మృతదేహాలను అప్పగించేందుకు తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment