వరదల కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన కాశ్మీరీల కోసం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విరాళాల సేకరణ ప్రారంభించాడు. స్వచ్ఛంద సంస్థ కేర్ ఇండియాతో కలిసి కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలంటూ ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకేవారి కోసం కేర్ ఇండియాకు సంబంధించిన ఓ వెబ్‌సైట్ లింక్‌ను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘హాయ్.. నేను మీ కునాల్ కపూర్‌ను..! కాశ్మీర్ వరదల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. అక్కడి భీకర పరిస్థితిని మీడియా కళ్లకుగట్టినట్లు చూపించింది. ఇప్పటిదాకా 215 మంది మరణించారట. వేలాదిమంది సర్వస్వాన్ని కోల్పోయారట. ఈ దృశ్యాలు నన్ను ఎంతగానో కదిలించాయి.
అందుకే కాశ్మీరీల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి ప్రజలు కూడా మనలాంటివారే. అందుకే అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాతో చేతులు కలపండి. కాశ్మీరీల సహాయం కోసం విరాళాలు సేకరిద్దాం. దేశ ప్రజలుగా వారికి మనమందరం ఉన్నామనే భరోసా కల్పిద్దాం. అందుకోసం చేతనైనంత సాయం చేద్దాం. ఈ సందేశంతోనే నేను మీకో వెబ్‌సైట్ లింక్‌ను పంపుతున్నాను. దీనిద్వారా మీరు విరాళాలను అందజేయవచ్చు. కేర్ ఇండియా సంస్థ ఈ విరాళాలతో కాశ్మీర్ ప్రజల కోసం అవసరమై సామగ్రిని కొనుగోలు చేసి, పంపుతుంది.
పాలిథిన్ కవర్లు, మ్యాట్స్, సబ్సు, టూత్ బ్రష్ వంటివేకాకుండా దుప్పట్లు వంటివి పంపుతారు. రూ. 5000 విలువజేసే వంద కిట్‌లను పంపుతారు. కనీసం వంద కుటుంబాలకైనా మనం సాయం చేసినవారమవుతాం. వరదల్లో చిక్కుకున్న 76,500 మందిని సహాయ శిబిరాలకు చేర్చారు. వారిలో ఎంతమందికి అన్ని సదుపాయాలు అందుతున్నాయో చెప్పలేం. మనలాంటివారు చేసే సాయం కూడా ప్రభుత్వ సాయానికి తోడైతే బాధితుల్లో మనమంతా ఉన్నామనే భరోసా పెరుగుతుంద’ని కునాల్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నాడు.
చేతనైనంత సాయం చేద్దాం!
Published Wed, Sep 10 2014 10:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement