దొంగలు అరెస్ట్ ... భారీగా బంగారం స్వాధీనం
వేలూరు: వేలూరు, క్రిష్ణగిరి జిల్లాల్లో వేర్వేరు కేసులకు సంబంధించి 238 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ ఐజీ మంజునాథ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన వేలూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపత్తూరు రీజినల్‌లోని కందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాగంగరై వద్ద గత నెల 5న జరిగిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి ఓమకుప్పం గ్రామానికి చెందిన గుణ, ఆలంగాయంకు చెందిన రామన్, చిత్తూరుకు చెందిన త్యాగు, ప్రతాప్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. వేలూరు, కృష్ణగిరి జిల్లాల్లో 53 చోట్ల చోరీలు చేసి 238 సవర్ల బంగారం, నగదును చోరీ చేసినట్లు వాటిని అక్కడక్కడ విక్రయించినట్లు వారు విచారణలో తెలిపారు. వీటిలో వేలూరు జిల్లాకు 48 కేసులకు సంబంధించి 219 సవర్ల బంగారం, క్రిష్ణగిరి జిల్లాకు సంబంధించి 20 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ బంగారాన్ని విచారణ జరిపి యజమానులకు అప్పగిస్తామన్నారు.
అదే విదంగా వేలూరు జిల్లాలోని వాలాజకు చెందిన పారిశ్రామిక వేత్త గోపిని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఒకే రోజులో నిందితులను సెల్‌ఫోన్ ఆదారంగా పట్టుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం గోపిని కిడ్నాప్ చేసిన దుండగులు సెల్‌ఫోన్ ఆధారంగా నిందితులు ఆంధ్ర, చిత్తూరులోని గంగనపల్లిలోని ఒక ఇంటిలో దాచి ఉంచినట్లు కనుగొని ఆర్కాడుకు చెందిన రాజగోపాల్, గంగనపల్లికి చెందిన వినోద్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనుమానితులు కనిపిస్తే నంబర్‌కు 9488835716 ఫోన్‌గానీ, మెసేజ్ గానీ చేస్తే సంబంధిత పోలీసులు చేరుకుంటారన్నారు. ఎస్పీ విజయకుమార్ మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వారు వేరుగా ఒక ఇంటిలో ఉండరాదని అలా ఉంటే పోలీసుల నెంబర్‌ను పెట్టుకోవాలన్నారు.