రియల్ వ్యాపారుల బరితెగింపు | land grabbing in nirmal | Sakshi
Sakshi News home page

రియల్ వ్యాపారుల బరితెగింపు

Published Tue, Sep 6 2016 12:35 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

land grabbing in nirmal

 తటాకాల భూముల కబ్జాకు పక్కా ప్రణాళిక..
 దొంగచాటుగా చెరువుల్లో నీటిని ఖాళీ చేస్తున్న వైనం..
 ఓ కీలక ప్రజాప్రతినిధి బినామీల దందా..
 కొత్త జిల్లా నిర్మల్‌లో బరితెగిస్తున్న రియల్ వ్యాపారులు
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా ప్రకటనతో అక్కడ ‘రియల్’ దందా జోరందుకుంది. వంద గజాల ప్లాటు విలువ రూ.లక్షల్లో పలుకుతోంది. ఈ తరుణంలో రియల్ గద్దల కన్ను ఇప్పుడు చెరువు భూములపై పడింది. రూ.కోట్లు విలువై చెరువు భూములను కబ్జా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నిండుకుండను తలపిస్తున్న చెరువు నీటిని దొంగచాటున తోడేస్తున్నారు. దీంతో ఖాళీ అవుతున్న చెరువు భూములను కబంధ హస్తాల్లోకి తీసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. రూ.వందల కోట్లు వెచ్చించి చెరువులకు మరమ్మతులు చేపట్టింది. కానీ ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా అక్రమార్కులు ఈ చెరువులను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కళ్ల ముందే చెరువు భూములను కబ్జా చేస్తుంటే ఇటు రెవెన్యూ అధికారులు గానీ, చిన్న నీటి పారుదల శాఖ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూస్తున్న దాఖలాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
 
నీళ్లు ఖాళీ చేస్తున్నదెవరూ.?
కంచరోని చెరువులో నుంచి గత నెల రోజులుగా తరచూ నీటిని వదిలేస్తున్నారు. ఈ చెరువు కింద భూములకు పంటల కోసం నీరు వదులుతున్నారని భావిస్తే కాలువలో కాలేసినట్లే. ఎందుకంటే ఈ చెరువు కింద ఉన్న భూములు ఎప్పుడో రియల్‌ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. శ్యాంఘడ్‌కు చుట్టూ సుమారు పదికి పైగా అక్రమ వెంచర్లు వెలిశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చెరువునే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ధర్మసాగర్ చెరువులో నిత్యం నిర్మాణాలే..
నిర్మల్ పట్టణంతోపాటు, చుట్టూ పలు గొలుసుకట్టు చెరువులున్నాయి. ఒక్క చెరువు నిండితే మరో చెరువులోకి నీళ్లు వచ్చే విధంగా వీటిని నిర్మంచారు. పట్టణం విస్తరించడంతో అక్రమార్కులు ఈ చెరువులు, వాటి కాలువలను క్రమంగా కబ్జా చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల కీలక ప్రజాప్రతినిధులు, నేతలు ఈ భూములను కబ్జా చేశారు. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కబ్జాలతో పూర్తిగా కుచించుకుపోయింది. తాజాగా ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చి దిద్దే పనుల పేరుతో ఈ చెరువు నీటిని కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే సగం చెరువు ఖాళీ అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని చెరువులో మరిన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
మా దృష్టికి రాలేదు 
నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువుల్లో నీటిని ఖాళీ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. చెరువు భూములు కబ్జా అవుతున్నట్లు మాకు తెలియదు. ఆర్డీఓతో మాట్లాడి చెరువు భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రులు, డ్రైనేజీ వేస్ట్ వాటర్‌తో ధర్మసాగర్ చెరువులో నిండిన మురికి నీటిని తొలగిస్తున్నాము. చెరువు భూములు కబ్జా కాకుండా చూస్తాం.
-శ్రీనివాస్, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement